Telugu Global
Andhra Pradesh

రంగాను కాపాడేందుకు వెళ్లి చంద్రబాబుకు కత్తిపోట్లు.. నెక్ట్స్‌ ప్రచారం ఇదే..

దేవినేని నెహ్రుకు రంగాను చంపేంత శక్తి లేదని.. నాడు ప్రభుత్వమే రంగాను హత్య చేయించిందన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తీరు చూస్తుంటే త్వరలోనే నాడు రంగాను కాపాడేందుకు చంద్రబాబు వెళ్లి రెండు కత్తిపోట్లు కూడా తిన్నారని ప్రచారం చేసేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

రంగాను కాపాడేందుకు వెళ్లి చంద్రబాబుకు కత్తిపోట్లు.. నెక్ట్స్‌ ప్రచారం ఇదే..
X

రంగాను హత్య చేసిన వ్యక్తులు, పార్టీలు కూడా ఈ రోజు ఆయనకు పూల దండలేస్తున్నాయని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. అది ఒక విధంగా రంగా గొప్పతనమన్నారు. తాను క్రమం తప్పకుండా రంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని గుర్తు చేసుకున్నారు.

రంగాను చంపిన టీడీపీ ఇప్పుడు ఓట్ల కోసం ఆయన అభిమానుల బూట్లు నాకే పరిస్థితికి వచ్చిందని విమర్శించారు. రంగా హత్య చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందన్నారు. ఎన్నికల వస్తుండడంతో ఓట్ల కోసం రంగా విగ్రహాలకు టీడీపీ నేతలు పూలదండలేస్తున్నారు. టీడీపీకి కుక్కకాటుకు చెప్పు దెబ్బ తరహాలోనే గుణపాఠం ఉంటుందన్నారు. నిన్న గుడివాడలో జరిగింది టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుకు, వంగవీటి రంగా అభిమానులకు మధ్య గొడవ అన్నారు కొడాలి.

రంగాను హత్య చేసి ఇప్పుడు ఆయనకు ఎలా పూలదండేస్తారని రంగా అభిమాని కాళీ ఫోన్ చేసి రావి వెంకటేశ్వరరావును ప్రశ్నించారని అందులో తప్పేముందని కొడాలి ప్రశ్నించారు. దాన్ని అడ్డుపెట్టుకుని రావి వెంకటేశ్వరరావు డ్రామా చేస్తున్నారని కొడాలి ఎద్దేవా చేశారు. గతంలో తాను టీడీపీలో ఉన్నప్పుడు వంగవీటి రాధాతో కలిసి రంగా విగ్రహావిష్కరణకు వెళ్తే చంద్రబాబు పిలిచి తనకు వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దు అని మాట్లాడారని గుర్తు చేశారు.

రంగా హత్య తర్వాత గుడివాడలో జరిగిన గొడవల్లో రావి వెంకటేశ్వరరావు ఇంటిని, దుకాణాన్నే రంగా అభిమానులు కాల్చారని గుర్తు చేశారు. బట్టల దుకాణంలోని చీరలను ఎత్తుకెళ్లారంటూ పోలీసులను తీసుకొచ్చి ఇంటింటికి తిరిగి పండుగకు సొంతంగా తెచ్చుకున్న చీరలను కూడా స్వాధీనం చేసుకున్నది రావి కుటుంబం కాదా అని ప్రశ్నించారు. గుడివాడలో రంగా అభిమానులపై కేసులు పెట్టి జైలుకు పంపింది ఎవరని ప్రశ్నించారు. వైసీపీలో రాజకీయ విభేదాల కారణంగా రాధా బయటకు వెళ్లిపోయారని.. రాజకీయ విభేదాలకు, రంగా హత్యకు తేడా లేదా అని ప్రశ్నించారు.

దేవినేని నెహ్రుకు రంగాను చంపేంత శక్తి లేదని.. నాడు ప్రభుత్వమే రంగాను హత్య చేయించిందన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తీరు చూస్తుంటే త్వరలోనే నాడు రంగాను కాపాడేందుకు చంద్రబాబు వెళ్లి రెండు కత్తిపోట్లు కూడా తిన్నారని ప్రచారం చేసేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

First Published:  26 Dec 2022 8:04 AM GMT
Next Story