Telugu Global
Andhra Pradesh

చంద్ర‌బాబు ఎక్క‌డ కాలు పెడితే అక్క‌డ నాశ‌న‌మే..

కందుకూరు ఘ‌ట‌న‌కు చంద్ర‌బాబు, లోకేష్‌, రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ‌, టీవీ5 బీఆర్ నాయుడుల‌ను బాధ్యుల‌ను చేయాల‌ని కొడాలి నాని డిమాండ్ చేశారు.

చంద్ర‌బాబు ఎక్క‌డ కాలు పెడితే అక్క‌డ నాశ‌న‌మే..
X

చంద్ర‌బాబు ఎక్క‌డ కాలు పెడితే అక్క‌డ నాశ‌న‌మే..

నూత‌న సంవ‌త్స‌రం తొలిరోజు గుంటూరులో తెలుగుదేశం పార్టీ నిర్వ‌హించిన చంద్రన్న కానుక‌ల కార్య‌క్ర‌మంలో ముగ్గురు మ‌హిళ‌లు మృతిచెందిన ఘ‌ట‌న‌పై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఆదివారం సాయంత్రం ఆయ‌న మాట్లాడుతూ చంద్ర‌బాబు ఎక్క‌డ కాలు పెడితే అక్క‌డ నాశ‌న‌మేన‌ని విమ‌ర్శించారు. స‌భ‌ల కోసం జనాన్ని తీసుకొచ్చి పిచ్చి ప‌బ్లిసిటీ చేస్తున్నార‌ని చెప్పారు. ఇరుకు సందులు చూసుకుని డ్రోన్ కెమెరాల‌తో షూట్ చేసుకుంటున్నార‌ని తెలిపారు. ఇదే తీరుతో మొన్న ప్ర‌కాశం జిల్లా కందుకూరులో 8 మందిని బ‌లిగొన్నార‌ని నాని మండిప‌డ్డారు.

కందుకూరు ఘ‌ట‌న‌కు వారిని బాధ్యుల‌ను చేయాలి..

కందుకూరు ఘ‌ట‌న‌కు చంద్ర‌బాబు, లోకేష్‌, రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ‌, టీవీ5 బీఆర్ నాయుడుల‌ను బాధ్యుల‌ను చేయాల‌ని కొడాలి నాని డిమాండ్ చేశారు. గుంటూరు స‌భ‌లో కానుక‌లిస్తామ‌ని 10 రోజుల నుంచి ప్ర‌చారంతో ఊద‌ర‌గొట్టార‌ని చెప్పారు. ఒక్కో మ‌హిళ‌కు మూడు చీర‌లిస్తామ‌ని చెప్పార‌ని వివ‌రించారు. ఈ పేరుతో 30 వేల మందికి టోకెన్లు పంచార‌ని తెలిపారు. కానుక‌లు, చీర‌లు ఇస్తామ‌ని దొంగ మాట‌లు చెప్పి జ‌నాన్ని ర‌ప్పించుకొని.. చంద్ర‌బాబు స్పీచ్ కోసం 2.30 గంట‌ల నుంచి జ‌నాన్ని నిల‌బెట్టార‌ని మండిప‌డ్డారు.

బాధితుల ఉసురు బాబుకు త‌గులుతుంది..

న‌లుగురికి చీర‌లు పంచి హ‌డావుడి చేశార‌ని, తొక్కిస‌లాట జ‌రిగి ముగ్గురు మృతిచెందార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మ‌ర‌ణాల‌కు ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బాధితుల ఉసురు చంద్ర‌బాబుకు క‌చ్చితంగా త‌గులుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. చ‌నిపోయిన మ‌హిళ‌ల‌కు చంద్ర‌బాబు ఏం స‌మాధానం చెబుతాడ‌ని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబుకు సిగ్గు, శ‌రం లేద‌ని, తాను అధికారంలోకి రావ‌డానికి ఎవ‌రెలా చ‌చ్చినా బాబుకు అవ‌స‌రం లేద‌ని విమ‌ర్శించారు. శ‌నికి మ‌రో రూప‌మే చంద్ర‌బాబ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ్యాఖ్యానించారు. గుంటూరు ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం న్యాయ విచార‌ణ చేప‌ట్టి, బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కొడాలి నాని డిమాండ్ చేశారు.

First Published:  2 Jan 2023 4:10 AM GMT
Next Story