Telugu Global
Andhra Pradesh

అశ్వ‌నీద‌త్‌, రాఘ‌వేంద్ర‌రావుకు కోరుకున్న‌చోట భూములిచ్చారు.. - కొడాలి నాని

అమ‌రావ‌తిలో ధ‌నికులే ఉండాలా? పేద‌లు ఉండొద్దా ? అని కొడాలి నాని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. అమ‌రావ‌తిని క‌మ‌రావ‌తి, భ్ర‌మ‌రావ‌తి చేసింది చంద్ర‌బాబు కాదా అని నిల‌దీశారు.

అశ్వ‌నీద‌త్‌, రాఘ‌వేంద్ర‌రావుకు కోరుకున్న‌చోట భూములిచ్చారు.. - కొడాలి నాని
X

అమ‌రావ‌తిని చంద్ర‌బాబు నాయుడు రియ‌ల్ ఎస్టేట్ కంపెనీగా మార్చార‌ని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమ‌ర్శించారు. గురువారం అసెంబ్లీ స‌మావేశాల్లో వికేంద్రీక‌ర‌ణ‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న మాట్లాడారు. చంద్ర‌బాబు బినామీలు ద‌ళితుల‌ను భ‌య‌పెట్టి వారి భూముల‌ను లాక్కున్నార‌ని చెప్పారు. అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్లు ఇస్తామంటే కోర్టుల‌కు వెళ్లి అడ్డుకున్నార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు త‌న‌కు కావాల్సిన వారికి కోరుకున్న‌చోట భూములిచ్చార‌ని కొడాలి నాని విమ‌ర్శించారు. సినీ నిర్మాత అశ్వ‌నీద‌త్‌, ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుల‌కు వారు కోరుకున్న‌చోట అమ‌రావ‌తిలో భూములిచ్చార‌ని గుర్తుచేశారు.

అమ‌రావ‌తిలో ధ‌నికులే ఉండాలా? పేద‌లు ఉండొద్దా ? అని కొడాలి నాని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. అమ‌రావ‌తిని క‌మ‌రావ‌తి, భ్ర‌మ‌రావ‌తి చేసింది చంద్ర‌బాబు కాదా అని నిల‌దీశారు. అమ‌రావ‌తి ప్ర‌క‌టించ‌క‌ముందు అక్క‌డ ఎక‌రం భూమి విలువ రూ.50 ల‌క్ష‌లు ఉంటే.. దానిని గ్రాఫిక్స్ మాయాజాలంతో రూ.5 కోట్లకు తీసుకెళ్లార‌ని చెప్పారు.

అమ‌రావ‌తిలో టీడీపీ నేత‌లంద‌రికీ భూములున్నాయ‌ని కొడాలి నాని గుర్తుచేశారు. వారంతా ఇత‌ర ప్రాంతాల్లోని భూములు అమ్మి అమ‌రావ‌తిలో కొన్నార‌ని చెప్పారు. అప్పుడు అలా భూములు కొన్న‌వాళ్లే ఇప్పుడు అమ‌రావ‌తి రాజ‌ధాని కావాలంటున్నార‌ని ఆయ‌న తెలిపారు.

సీఎం జ‌గ‌న్‌పై బుర‌ద జ‌ల్ల‌డ‌మే కొంద‌రు ప‌నిగా పెట్టుకున్నార‌ని, వారికి రాష్ట్రాన్ని బాగుచేయాల‌నే ఉద్దేశం లేద‌ని స్ప‌ష్టం చేశారు. టీడీపీ నేత‌ల‌కు రాష్ట్ర అభివృద్ధి అవ‌స‌రం లేద‌ని, వారికి స్వార్థ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని కొడాలి నాని విమ‌ర్శించారు.

ఇప్పుడు దుర్మార్గులందరూ క‌ల‌సి రోడ్ల‌పైకి వ‌చ్చార‌ని, వారు చేస్తున్న పాద‌యాత్ర చంద్ర‌బాబు కోస‌మా.. రాజ‌ధాని కోస‌మా అని నిల‌దీశారు. ఖ‌మ్మంలో కార్పొరేట‌ర్‌గా గెల‌వ‌లేని రేణుకా చౌద‌రి అమ‌రావ‌తి గురించి మాట్లాడ‌ట‌మా..? అని ఎద్దేవా చేశారు. ఒక్క ప్రాంత‌మే అభివృద్ధి చెందితే.. మిగ‌తా ప్రాంతాలు ఏం కావాల‌ని ఈ సంద‌ర్భంగా కొడాలి నాని ప్ర‌శ్నించారు.

ఓ న‌లుగురి చేతిలో చంద్ర‌బాబు కీలుబొమ్మ‌లా మారాడ‌ని, 40 ఆల‌యాల‌ను కూల్చిన దుర్మార్గుడు ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నాడ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. మూడు ప్రాంతాలూ అభివృద్ధి కావాలంటే ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌న్న‌దే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ముఖ్య ఉద్దేశ‌మ‌ని చెప్పారు. ఒక కులానికో.. మ‌తానికో వ్య‌తిరేకంగా వికేంద్రీక‌ర‌ణ చేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోస‌మే వికేంద్రీక‌ర‌ణ అని తేల్చిచెప్పారు.

First Published:  15 Sep 2022 10:57 AM GMT
Next Story