Telugu Global
Andhra Pradesh

ఏపీలో గోతుల రాజకీయం.. రాజకీయ సన్యాసం..

ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కొత్త రోడ్లు వేస్తుంటే, పాత రోడ్లు పాడైపోతుంటాయని వివరించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని భూతద్ధంలో పెట్టి చూస్తున్నవారికి ఇతర రాష్ట్రాల్లో రోడ్ల దుస్థితి కనిపించలేదా అని నిలదీశారు.

ఏపీలో గోతుల రాజకీయం.. రాజకీయ సన్యాసం..
X

ఏపీలో రోడ్లపై గోతులున్నాయంటూ జనసేన మొదలు పెట్టిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే డిజిటల్ క్యాంపెయిన్ వైసీపీని చికాకు పెడుతోంది. దీంతో దాదాపుగా అందరు నేతలు ఇదే విషయంపై కౌంటర్లివ్వడం మొదలు పెట్టారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా కొడాలి నాని జనసేనానిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్రాల్లో గోతులు లేవా అంటూ ప్రశ్నించారు. "ఏ రాష్ట్రానికైనా వెళ్తాం. కనీసం 10 శాతం గోతులు లేని రోడ్డు చూపించు.. అలా చూపించగలిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా"నంటూ సవాల్ విసిరారు. తనతోపాటు సీఎంని కూడా రాజకీయాలనుంచి తప్పుకోవాలని కోరతానన్నారు. తన సవాల్ ని స్వీకరించలేకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ రాజకీయాలనుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ రోడ్లు ఎలా ఉన్నాయి..?

విజయవాడ రోడ్లపైనే గోతులున్నాయా, హైదరాబాద్ రోడ్లపై గోతులు లేవా అని ప్రశ్నించారు కొడాలి నాని. హైదరాబాద్ లో జర్నలిస్ట్ కాలనీ సహా చాలా రోడ్లపై గోతులున్నాయని, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే హైవేపైనే గుంతలు ఉన్నాయని చెప్పారు కొడాలి నాని. భారత దేశంలో ఏ రోడ్డు తీసుకున్నా 10-20 శాతం గోతులు ఉండటం సహజమేనన్నారు నాని. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కొత్త రోడ్లు వేస్తుంటే, పాత రోడ్లు పాడైపోతుంటాయని వివరించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని భూతద్ధంలో పెట్టి చూస్తున్నవారికి ఇతర రాష్ట్రాల్లో రోడ్ల దుస్థితి కనిపించలేదా అని నిలదీశారు.

శపథం కంటే రాష్ట్రపతి ఎన్నిక ఎక్కువైందా..?

సీఎం అయ్యేంత వరకు అసెంబ్లీకి రానంటూ ఆరోజు శపథం చేసిన చంద్రబాబు.. రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కోసం అసెంబ్లీలో అడుగు పెట్టారని, ఆయన శపథం ఏమైందని ప్రశ్నించారు నాని. చంద్రబాబుకు తన భార్య విషయంలో చేసిన శపథం కంటే రాష్ట్రపతి ఎన్నిక ఎక్కువైందా అని ప్రశ్నించారు. చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోయారని.. ఆయన మాటను ఎవరూ నమ్మరని చెప్పారు. ఇక వరదల సహాయక చర్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టారు కొడాలి నాని. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గోదావరి వరద ప్రాంతంలో సీఎం జగన్ పునరావాస ఏర్పాట్లు కల్పించారని, బాధితులకు ఆహారం, నీరు అందించడమే కాకుండా కుటుంబానికి రూ.2 వేలు ఇచ్చారన్నారు.

First Published:  19 July 2022 2:19 AM GMT
Next Story