Telugu Global
Andhra Pradesh

మరి ఇవి ఏ రాజ్యాంగ స్ఫూర్తిలో ఉన్నాయి చంద్రబాబు

ఓటుకు నోటు కేసు రాజ్యాంగ స్పూర్తా..? రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసి నాలుగు వేల ఎకరాలను కొట్టేయడమా రాజ్యాంగ స్పూర్తి అంటే అని నిలదీశారు.

మరి ఇవి ఏ రాజ్యాంగ స్ఫూర్తిలో ఉన్నాయి చంద్రబాబు
X

రాజ్యాంగానికి రాష్ట్రంలో తూట్లు పొడుస్తున్నార‌ని చంద్రబాబు బహిరంగ లేఖ రాయడంపై మాజీ మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, క్యాంపులు పెట్టి కూల్చేయడం ఏ రాజ్యాంగస్పూర్తి అని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టు కొని, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడమా రాజ్యాంగస్పూర్తి అని నిలదీశారు.

ఓటుకు నోటు కేసు రాజ్యాంగ స్పూర్తా..? రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసి నాలుగు వేల ఎకరాలను కొట్టేయడమా రాజ్యాంగ స్పూర్తి అంటే అని నిలదీశారు. ముఖ్యమంత్రి హోదాలో దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అనడమా ?, రైతులు విద్యుత్ చార్జీలు తగ్గించాలని రోడ్డు ఎక్కితే బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి చంపడమా రాజ్యాంగ స్పూర్తి అని కన్నబాబు ప్రశ్నించారు.

ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, కొందరిని అడ్డువస్తున్నారని ఏకంగా హత్యలు చేయించి గద్దెనెక్కే ప్రయత్నం చంద్రబాబు చేశారని, మరి అదేం స్పూర్తి అని కన్నబాబు ప్రశ్నించారు. ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే పులిపాలు తాగినట్టే అని అంబేద్కర్ చెప్పారని.. మరి జగన్ ఇంగ్లీష్ మీడియం అందిస్తుంటే ఇదే చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించలేదా అని కన్నబాబు ప్రశ్నించారు.

అమరావతిలో పేదలను ఇళ్ల స్థలాలు ఇస్తుంటే సామాజిక సమతూల్యత దెబ్బతింటుందని కోర్టులకు వెళ్లడమా రాజ్యాంగ స్పూర్తి అంటే అని చంద్రబాబును కన్నబాబు ప్రశ్నించారు. చంద్రబాబుతో రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని ప్రజలు అనుకోబట్టే మొన్నటి ఎన్నికల్లో సొంత కుమారుడిని కూడా ఓడించి కేవలం 23 స్థానాలకు టీడీపీని పరిమితం చేశారని గుర్తు చేశారు.

నారా లోకేష్‌ పాదయాత్ర అమరావతివాదుల పాదయాత్రలాగే ఉంటుందని కన్నబాబు ఎద్దేవా చేశారు. రైతులు మాత్రమే పాదయాత్ర చేయాలని హైకోర్టు చెప్పిన ఒకే మాటకు యాత్ర ఆగిపోయిందని కన్నబాబు వ్యాఖ్యానించారు.

First Published:  26 Nov 2022 12:13 PM GMT
Next Story