Telugu Global
Andhra Pradesh

ముద్రగడ పాత్రపై హరిరామ జోగయ్య కన్ను

అగ్రవర్ణాల వారికి కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం ప్రత్యేకంగా కేటాయించినా అగ్రవర్ణాల్లోని ఇతర కులస్తులకు ఎలాంటి నష్టం ఉండదని కూడా లేఖలో జోగయ్య వాదించారు.

ముద్రగడ పాత్రపై హరిరామ జోగయ్య కన్ను
X

టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. ఆ స్థానాన్ని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. కాపు రిజర్వేషన్ల కోసం తాను పోరాటం చేయ‌బోతున్న‌ట్టు జోగయ్య ప్రకటించారు. జనవరి 2 నుంచి నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెడుతున్నట్టు వెల్లడించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది ఆయన డిమాండ్. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.

కాపుల రిజర్వేషన్ల అమలు అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అని కేంద్రం చెప్పిన తర్వాత కూడా ఆ కోటాను అమలు చేసేందుకు అభ్యంతరం ఏమిటని లేఖలో ప్రశ్నించారు. ఈ నెలాఖరులోగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇవ్వాలని లేనిపక్షంలో జనవరి రెండు నుంచి ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. తన లేఖను ముందస్తు నోటీసుగా పరిగణించాలని కూడా కోరారు.

అగ్రవర్ణాల వారికి కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం ప్రత్యేకంగా కేటాయించినా అగ్రవర్ణాల్లోని ఇతర కులస్తులకు ఎలాంటి నష్టం ఉండదని కూడా లేఖలో జోగయ్య వాదించారు. అయితే కాపు రిజర్వేషన్ల పోరాటం వల్ల కాపులకు ఇతర కులాల వారు దూరమవుతున్నారని ఒకవైపు మాజీ సీఎస్ రామ్మోహన్‌ రావు లాంటి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ జోగయ్య రిజర్వేషన్ల పోరాటానికి దిగడం వెనుక రాజకీయ కోణం ఉందన్న చర్చ నడుస్తోంది.

First Published:  26 Dec 2022 2:50 AM GMT
Next Story