Telugu Global
Andhra Pradesh

త్రిశంకుస్వర్గంలో మోగుతున్న గంట

విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు, అధికార వైసీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అవి విఫలం కావడంతో టిడిపిలో కొనసాగలేక, దిక్కులు చూస్తున్నారు. జనసేనతో టచ్లో వుంటూనే.. బీజేపీతో మంతనాలు సాగిస్తారు.

త్రిశంకుస్వర్గంలో మోగుతున్న గంట
X

అధికారం ఎక్కడుంటే అక్కడే మోగే గంట మూడేళ్లుగా మూగబోయింది. షర్టులు మార్చినట్టు పార్టీలు మార్చే మాజీ మంత్రి ప్రస్తుతం త్రిశంకుస్వర్గంలో వున్నారు. గంటా శ్రీనివాసరావు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఉత్తరాంధ్ర కాకపోయినా, ఇక్కడే సెటిలై ఏ ప్రాంతం నుంచైనా, ఏ పార్టీ నుంచైనా గెలుస్తాడనే పేరొందిన రాజకీయ చాణక్యం గంటా సొంతం. ఏ పార్టీ నుంచి గెలిచినా అధికారంలో వున్న పార్టీలో చేరి పదవులు పొందడం గంటా స్టైల్. ఇన్నేళ్ల ఊసరవెల్లి రాజకీయాలకు వైసీపీ చెక్ పెట్టింది. 2019లో టిడిపి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు, అధికార వైసీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అవి విఫలం కావడంతో టిడిపిలో కొనసాగలేక, దిక్కులు చూస్తున్నారు. జనసేనతో టచ్లో వుంటూనే.. బీజేపీతో మంతనాలు సాగిస్తారు.

మధ్యలో కాపు కార్డుతో సమావేశాలు పెడతారు. పేరుకి టిడిపి ఎమ్మెల్యే అయినా ఆ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనరు. ఆయనని టచ్ చేసే సాహసం టిడిపి చేయదు. పార్టీతో అంటీముట్టనట్టు గంటా వున్నా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే టిడిపిలో కనిపించని పవర్ సెంటర్ మాజీ మంత్రి నారాయణ వియ్యంకుడు కావడం మొదటి కారణమైతే.. గంటాకి రాష్ట్రమంతా అన్ని పార్టీల అధినేతలతో సంబంధాలున్నాయి. అలాగే ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గాల్లో పట్టుంది. గంటాని కదిపితే మోత మోగడం ఖాయమనే టిడిపి మిన్నకుంటోంది.

రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారి 1999లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా, 2004 ఎన్నికల్లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యంలో చేరి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు మంత్రిగా చాన్స్ కొట్టేశారు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అనంతరం 2019 విశాఖ ఉత్తరం నుంచి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ పార్టీ అధికారం కోల్పోయింది. ఇక అంతే..పార్టీకి దూరమయ్యారు. దీనికి గంటాకి ఒక సాకు కూడా దొరికింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా చేసిన రాజీ`డ్రామా` రక్తి కట్టలేదు. అధికారంలేని టిడిపిలో వుండలేడు. అధికారం వున్న వైసీపీ రానివ్వదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుని కలుస్తాడు. మరో రోజు పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతాడు. కాపు మేధావుల మీటింగులో ప్రత్యక్షమవుతాడు. టిడిపిలో ఎప్పుడెళ్లినా రెడ్ కార్పెట్ పరిచి వుంటుందనే ధీమా మిగిలిన పార్టీలతో బేరసారాలకు దిగుతూ ఎటూ తేల్చుకోలేక త్రిశంకుస్వర్గంలో సతమతమవున్నాడు గంటా.

First Published:  25 Nov 2022 10:05 AM GMT
Next Story