Telugu Global
Andhra Pradesh

టోపీ పెట్టుకుంటే తప్పేంటి..? మాజీ మంత్రి అనిల్ కౌంటర్

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులంతా ఎరుమేలిలో వావర్ స్వామిని దర్శించుకునే విషయం తెలియదా అని బీజేపీ నేతల్ని ప్రశ్నించారు మాజీ మంత్రి అనిల్. వావర్ స్వామి ముస్లిం కాదా అని నిలదీశారు.

టోపీ పెట్టుకుంటే తప్పేంటి..? మాజీ మంత్రి అనిల్ కౌంటర్
X

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయ్యప్పమాల ధరించి, ముస్లింలకు సంబంధించిన టోపీ ఎలా పెట్టుకుంటారంటూ ఇటీవల బీజేపీ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ముస్లిం ప్రాంతాల్లో గడప గడప పర్యటనకు వెళ్లిన సమయంలో అనిల్ వారి సంప్రదాయం ప్రకారం టోపీ పెట్టుకుని నాయకులతో కలసి నడిచారు. దీన్ని బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి తప్పుబట్టారు, అనిల్, అయ్యప్ప మాలను అవమానించారని, అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత నెల్లూరులోని అనిల్ ఇంటిని కొంతమంది బీజేపీ నేతలు ముట్టడించారు. అనిల్ క్షమాపణ చెప్పాలంటూ వారు ధర్నా చేశారు. ఈ క్రమంలో తాజాగా గడప గడప కార్యక్రంలో పాల్గొన్న అనిల్ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. అయ్యప్ప మాల వేసుకున్నవారు పరమత సహనంతో ఉండకూడదా అని ప్రశ్నించారు. ముస్లింలకు సంబంధించిన టోపీ ధరించడంలో తప్పేంటని అడిగారు.

వావర్ స్వామి ముస్లిం కాదా..?

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులంతా ఎరుమేలిలో వావర్ స్వామిని దర్శించుకునే విషయం తెలియదా అని ప్రశ్నించారు అనిల్. వావర్ స్వామి ముస్లిం కాదా అని నిలదీశారు. కన్నె స్వాములందరూ వావర్ స్వామి ఉండే మసీదును దర్శించుకుంటారని, ముస్లిం దేవతలను ప్రార్థించేవారిలో సగానికి సగం మంది హిందువులే ఉంటారని అనిల్ చెప్పారు. బీజేపీ నేతలు కనీసం అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాను హిందువులను అవమానించలేదని, తాను చేసింది తప్పుకాదని ప్రజలకు తెలుసని అన్నారు అనిల్. ఇప్పటికైనా విజ్ఞతతో ఆరోపణలు చేస్తే మంచిది అని హితవు పలికారు.

కేసుల్లో ముద్దాయిలు కూడా నన్ను విమర్శిస్తారా..?

కొన్ని కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వారు తన ఇంటి ముందు ఆందోళనలు చేయడం సిగ్గుచేటని అన్నారు అనిల్. శబరిమల వెళ్లకుండా తనని అడ్డుకోవాలని బీజేపీ నేతలు పిలుపునివ్వడం సరికాదన్నారు. శబరిమలకు వెళ్లకుండా తననెవరూ అడ్డుకోలేరన్నారు. తాను చేసింది తప్పుకాదని ప్రజలందరికీ తెలుసని, బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోందని మండిపడ్డారు అనిల్.

First Published:  27 Nov 2022 2:30 AM GMT
Next Story