Telugu Global
Andhra Pradesh

తెలుగు జాతిని కౌలుకిస్తున్నారు

రాజకీయాల కోసం తెలుగుజాతి భవిష్యత్తును కౌలుకి ఇచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు జాతిని అవుట్ సోర్సింగ్ కు ఇచ్చేసినట్టుగానే కనిపిస్తోందన్నారు.

తెలుగు జాతిని కౌలుకిస్తున్నారు
X

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర‌రావు మ‌రోసారి ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ మూడు ముక్కలు అవ్వడానికి సిద్ధంగా ఉందని.. అందుకు సోకాల్డ్ జాతీయ వాదులు కూడా అంతర్గతంగా మద్దతు తెలుపుతున్నారంటూ శుక్రవారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. తాజాగా తెలుగుజాతి భవిష్యత్తును కౌలుకి ఇచ్చే పరిస్థితులు వచ్చాయంటూ వ్యాఖ్యానించారు. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో సమతా పార్టీ జాతీయ అధ్యక్షుడు వి.వి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన అన్ని పార్టీలు, వర్గాల ఆత్మీయ సమావేశంలో ఏబీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన వెంకటేశ్వరరావు రాజకీయాల కోసం తెలుగుజాతి భవిష్యత్తును కౌలుకి ఇచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు జాతిని అవుట్ సోర్సింగ్ కు ఇచ్చేసినట్టుగానే కనిపిస్తోందన్నారు. మేధావుల చొరవ తగ్గుతోందన్నారు. రాజకీయ వరవడిలో కొట్టుకుపోతూ లేనిపోని అవలక్షణాలను అలవాటు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

అలాంటి పరిస్థితిని సరి చేసుకోకపోతే మన బాగుపడడం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు గొప్ప వరం మానవ వనరులేనన్నారు. ఐఐటీల్లో 30 నుంచి 40 శాతం మంది తెలుగు వారే ఉంటున్నారని , ఎన్ఐటీల్లో సగం మంది తెలుగువారు ఉన్నారని, వనరులను సరిగ్గా వాడుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీలో అన్ని కాలాల్లో పంటలు పండుతాయని, విలువైన ఖనిజ సంపద కూడా ఉందని, అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఉందో మేధావులు, చదువుకున్నవారు ఆలోచన చేయాలన్నారు.

కొత్తగా ఏర్పడిన ఏపీలో ఇబ్బందులు, విపరీత పరిస్థితులతో పాటు కొన్ని ఉన్మాదపు ధోరణులు కూడా ఉన్నాయని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. వీటిని అధిగమించాలి గాని నిరాశ చెందవద్దన్నారు. వీటిని సవరించుకోకపోతే మాత్రం భవిష్యత్తు తరాలు జీవించడమే కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

First Published:  8 Jan 2023 4:23 AM GMT
Next Story