Telugu Global
Andhra Pradesh

భర్త అడుగు జాడల్లో టీడీపీలోకి..?

ఇప్పటి వరకు నా భర్త నా నిర్ణయాలను అంగీకరించి నాతో నడిచారు. ఇప్పుడు ఆయన ఉద్యోగ విరమణ చేశారు. ఆయన తీసుకునే నిర్ణయాలకు నేను కట్టుబడి ఉంటా.

భర్త అడుగు జాడల్లో టీడీపీలోకి..?
X

జీవితాంతం తాము జగన్‌మోహన్ రెడ్డితోనే ఉంటామని గతంలో చాలా సార్లు చెప్పిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత... ఇప్పుడు అందుకు కాస్త భిన్నంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. వైసీపీలోనే ఉన్నాం అంటూనే.. పార్టీ కంటే తన భర్త నిర్ణయమే తనకు ముఖ్యమని తేల్చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆమె భర్త దయాసాగర్‌ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం నడుస్తోంది. ఆ నేపథ్యంలో తన భర్తతో పాటే తన ప్రయాణం అని సుచరిత సంకేతాలిచ్చినట్టు భావిస్తున్నారు.

''ఇప్పటి వరకు నా భర్త నా నిర్ణయాలను అంగీకరించి నాతో నడిచారు. ఇప్పుడు ఆయన ఉద్యోగ విరమణ చేశారు. ఆయన తీసుకునే నిర్ణయాలకు నేను కట్టుబడి ఉంటా. కుటుంబమంతా ఉంటే ఒకే పార్టీలో ఉంటాం. భర్త ఒక పార్టీలో, భార్య వేరొక పార్టీలో, పిల్లలు మరో పార్టీలో ఉండం. నా భర్త దయాసాగర్‌ పార్టీ మారుతాను.. నువ్వూ నాతో రా అంటే.. ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో వెళ్లాల్సిందేగా?'' అంటూ సుచరిత వ్యాఖ్యానించారు.

ఇన్‌కంటాక్స్ కమిషనర్‌గా పనిచేసిన దయాసాగర్‌ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు సుచరిత కూడా ఆయనతో పాటే నడిచేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం ఆమె చేసిన వ్యాఖ్యలతో ఊపందుకుంది. మంత్రి పదవి తొలగింపు నుంచి సుచరిత అసంతృప్తితో ఉన్నారు.

First Published:  6 Jan 2023 5:29 AM GMT
Next Story