Telugu Global
Andhra Pradesh

ఏపీలో రూ.36.55 కోట్ల ట్రాఫిక్ చలానాల సొమ్ము కొట్టేసిన మాజీ డీజీపీ అల్లుడు

ఏపీలో ట్రాఫిక్ పోలీసులు నమోదు చేసే కేసులకు సంబంధించిన జరిమానాలను ఈ-చలానాల రూపంలో వసూలు చేస్తారు.

ఏపీలో రూ.36.55 కోట్ల ట్రాఫిక్ చలానాల సొమ్ము కొట్టేసిన మాజీ డీజీపీ అల్లుడు
X

ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భారీ స్కామ్‌కు తెరతీశాడు. ట్రాఫిక్ ఈ-చలానాల పేమెంట్ గేట్‌వే సేవల కాంట్రాక్టు దక్కించుకొని.. దాని ద్వారా రూ.36.55 కోట్లు సొంత అకౌంట్లలోకి దారి మళ్లించాడు. తిరుపతిలో తీగలాగగా..ఈ భారీ కుంభకోణం బయటపడింది. ఈ కేసులో మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాశ్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. అవినాశ్, ఆయన కంపెనీ డేటా ఎవాల్వ్‌కు చెందిన ఆస్తుల క్రయవిక్రయాలకు తావులేకుండా రిజిస్ట్రేషన్ శాఖకు గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు లేఖ రాశారు.

ఏపీలో ట్రాఫిక్ పోలీసులు నమోదు చేసే కేసులకు సంబంధించిన జరిమానాలను ఈ-చలానాల రూపంలో వసూలు చేస్తారు. దీన్ని డీజీపీకి చెందిన అకౌంట్‌లోకి నాలుగు పేమెంట్ గేట్‌వేల నుంచి జమ అవుతుంది. ఇందులో డేటా ఎవాల్వ్ అనే సంస్థకు చెందిన రేజర్ పే అనే గేట్‌వే కూడా ఉన్నది. ఇది మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాశ్‌కు చెందిన కంపెనీ. అయితే రేజర్ పే నుంచి వెళ్లే సొమ్ము నేరుగా డీజీపీ ఖాతాలో జమ కాకుండా.. యాప్‌ను క్లోనింగ్ చేశారు. రేజర్ పే బదులుగా రేజర్ పేఈ అనే యాప్‌ను రూపొందించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వసూలు చేసే సొమ్ము రేజర్ పేఈ ద్వారా అవినాశ్ ఇతర అకౌంట్లకు తరలించాడు. ఇప్పటి వరకు రూ.36.55 కోట్ల మేర సొమ్మును సొంత అకౌంట్లలోకి తరలించుకున్నారు.

కాంట్రాక్టు ఇచ్చింది సాంబశివరావే..

కాగా, 2017 జూన్ 27న అప్పటి డీజీపీ సాంబశివరావు డేటా ఎవాల్వ్ అనే సంస్థకు ఈ-చలానాల సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతలను అప్పగించారు. ఆన్‌లైన్‌లో కేవలం రూ.1కే కోట్ చేయడంతో కాంట్రాక్టు ఇచ్చినట్లు అప్పట్లో పేర్కొన్నారు. టెండర్ దక్కించుకున్న డేటా ఎవాల్వ్ సంస్థ.. ఎవరికీ అనుమానం రాకుండా వసూలు చేసిన సొమ్ములో కొంత నొక్కేసి.. మిగిలిన సొమ్మును డీజీపీ ఖాతాకు జమ చేసింది. గత ఐదేళ్లలో రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన సొమ్ములో.. రూ.36.55 కోట్లు నొక్కేసింది.

ఇలా బయటపడింది..

తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ నర్సప్ప తన యూనిట్ నుంచి రోజూ ఎంత మొత్తం వసూలు అవుతుందో ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో మొదటి రోజు చూసిన మొత్తానికి, ఆ తర్వాత నాలుగు రోజులకు చూసే మొత్తానికి తేడా కనిపించింది. దీంతో ఈ ఏడాది మే 1 నుంచి 20 వరకు జరిగిన లావాదేవీలను ఆరా తీశారు. అందులో తేడా ఉన్నట్లు గమనించడంతో డీఎస్పీ నర్సప్ప విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. వెంటనే దీనిపై అంతర్గత విచారణ జరపడంతో ఈ భారీ కుంభకోణం బయటపడింది.

ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారా?

ఈ-చలాన్ల కుంభకోణంలో ఇప్పటికే ఎవాల్వ్ సంస్థకు చెందిన కొత్తపల్లి రాజశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కీలక నిందితుడైన కొమ్మిరెడ్డి అవినాశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అదే సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న అతని సోదరి అక్షిత, రవికిరణ్‌ కూడా ఈ కేసులో భాగస్వామ్యులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అందరిపై నిఘా ఉంచామని.. త్వరలోనే అరెస్టు చేస్తామని అన్నారు. క్లోనింగ్ యాప్ ద్వారా మళ్లించిన సొమ్ము ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్లిందనే విషయంపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

First Published:  20 Oct 2023 2:45 AM GMT
Next Story