Telugu Global
Andhra Pradesh

మూడు రాజధానులపై కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ , న్యాయవ్యవస్థ మూడు ఒకే ప్రాంతంలో ఉండడం అన్నదే పరిపాలనకు సౌలభ్యంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మూడు రాజధానులపై కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

నటుడు బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడు రాజధానుల అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి మూడు రాజధానులు సరైన నిర్ణయం కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.

శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ , న్యాయవ్యవస్థ మూడు ఒకే ప్రాంతంలో ఉండడం అన్నదే పరిపాలనకు సౌలభ్యంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో అధికారులు రావాల్సి ఉంటుందని, మంత్రులు కూడా హాజరు కావాల్సి ఉంటుందని అలాంటప్పుడు అసెంబ్లీ, సచివాలయం వేర్వేరు చోట్ల ఉండటం వల్ల ఇబ్బందులు వస్తాయని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైనా న్యాయ వివాదాలు వస్తే కోర్టులో ఏం ఫైల్ చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి నుంచి, మంత్రుల నుంచి అధికారులు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, హైకోర్టు కూడా అక్కడే లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని అభిప్రాయపడ్డారు. అందుకే హైకోర్టు, సచివాలయం, శాసనసభ అన్ని ఒకే చోట ఉంటే పరిపాలనకు సౌలభ్యంగా ఉంటుంది అన్నది తన అభిప్రాయమని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.

రాష్ట్ర విభజన జరిగితే దగ్గరి సంబంధాలు ఉన్న తెలుగు ప్రజలు విడిపోతారని, ప్రజలకు మంచి జరగదు అన్న ఉద్దేశంతోనే తాను ఆరోజు విభజనను వ్యతిరేకించానని కూడా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే కేంద్రం వద్ద తెలుగు వారి బలం కూడా తగ్గిపోతుందన్న ఉద్దేశంతోనే తాను ఆరోజు అలా వ్యతిరేకించానని వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు అంతా సాఫీగానే జరుగుతోందని, ప్రజలు కూడా కలిసిమెలిసి ఉన్నారని, రెండు రాష్ట్రాలు బాగుండాలి అన్నదే తన ఆకాంక్ష అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తాను పుట్టింది పెరిగింది చదువుకున్నది అంతా హైదరాబాద్‌లోనేనని, 53 ఏళ్ల తర్వాత తనను 'నీవు ' ఈ ప్రాంతానికి చెందిన వాడివి కాదు అన్నప్పుడు బాధేసిందని, విభజన కాలం నాటి పరిస్థితులను కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేసుకున్నారు

Next Story