Telugu Global
Andhra Pradesh

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు లబ్ది : సీఎం వైఎస్ జగన్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. మూడేళ్లుగా ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందంటే.. రాష్ట్ర ప్రభుత్వ పని తీరు ఎలా ఉందే ప్రజలతో పాటు కంపెనీలు కూడా అర్థం చేసుకోవాలన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు లబ్ది : సీఎం వైఎస్ జగన్
X

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల రైతులకు మరింత లబ్ది చేకూరుతుందని, ఇలాంటి యూనిట్లు మరింత ఎక్కువగా ఏర్పాటు చేయవల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేశామని ఆయన చెప్పారు. 26 జిల్లాల్లో ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా రైతులు పండించే పంటలన్నింటికీ మెరుగైన ధర వస్తుందని ఆయన చెప్పారు. పల్నాడు జిల్లా యడ్లపాటు మండలం వంకాయలపాడు స్పైసెస్ పార్కులో ఐటీసి సంస్థకు చెందిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై హర్షం వ్యక్తం చేశారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. మూడేళ్లుగా ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందంటే.. రాష్ట్ర ప్రభుత్వ పని తీరు ఎలా ఉందే ప్రజలతో పాటు కంపెనీలు కూడా అర్థం చేసుకోవాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసిన ఐటీసి సంస్థకు అభినందనలు తెలిపారు. ఈ యూనిట్ వల్ల ఎంతో మంది రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ సుమారు రూ. 200 కోట్ల వ్యయంతో ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేయనున్నట్లు తెలిపారు. రెండో దశ కూడా పూర్తయితే ఇది దేశంలోనే అతి పెద్ద స్పైసెస్ యూనిట్‌గా మారనున్నట్లు తెలిపారు.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా కేవలం రైతులకే కాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఇలాంటి యూనిట్ల కోసం రూ. 3,450 కోట్లు కేటాయించినట్లు సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఇతర కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. కంపెనీలకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం వేగంగా స్పందిస్తుందని హామీ ఇచ్చారు. కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం ఉంటుందని సీఎం జగన్ చెప్పారు.

ఇక్కడ ఏర్పాటు చేసిన యూనిట్‌లో ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందని కూడా విచారణ చేసినట్లు జగన్ చెప్పారు. మెటీరియల్ వచ్చిన తర్వాత క్లీనింగ్, గ్రేడింగ్, డీస్టీమింగ్, గ్రైండింగ్, బ్లెండింగ్, స్టీమ్ స్టెరిలైజేషన్, ప్యాకింగ్ వంటి పద్దతులు ఉంటాయని చెప్పారు. రైతులు పండించిన పంటకు వాల్యూ యాడ్ అవుతుందని తెలిపారు. ఇంత క్వాలిటీతో తయారయ్యే ప్రొడక్ట్స్‌ను ఎక్స్‌పోర్ట్ కూడా చేయవచ్చని చెప్పారు.

First Published:  11 Nov 2022 10:57 AM GMT
Next Story