Telugu Global
Andhra Pradesh

జెండాల గొడవ.. విశాఖలో బీజేపీ వర్సెస్ వైసీపీ

విశాఖలో ప్రధాని పర్యటన సందర్భంగా తాము జెండాలు కట్టుకుంటే, వాటిని తీసిపారేస్తున్నారంటూ మండిపడ్డారు సోము వీర్రాజు. కార్పొరేషన్ సిబ్బందిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జెండాల గొడవ.. విశాఖలో బీజేపీ వర్సెస్ వైసీపీ
X

ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా విశాఖను కాషాయ జెండాలతో నింపేయాలనుకున్నారు బీజేపీ నేతలు. ఆ ప్రయత్నాలు ఘనంగా చేపట్టారు. కానీ వైసీపీ ఊరుకుంటుందా. తమ టాలెంట్ చూపించాలనుకుంది. విశాఖ నగరం మొత్తం వైసీపీ జెండాలు పరిచేశారు. ఎక్కడ కనపడితే అక్కడ జెండాలు కట్టేశారు. బులుగుమయం చేశారు. దీంతో సహజంగానే బీజేపీ నేతలకు ఒళ్లుమండింది. నగరంలో ఎక్కడా కాషాయ జెండా కనపడ్డంలేదు. ఒకవేళ కొన్నిచోట్ల కట్టినా వాటిని తీసేసి వైసీపీ జెండాలు పెట్టుకుంటున్నారు. ఈ జెండాల గొడవలో నేరుగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

విశాఖలో ప్రధాని పర్యటన సందర్భంగా తాము జెండాలు కట్టుకుంటే, వాటిని తీసిపారేస్తున్నారంటూ మండిపడ్డారు సోము వీర్రాజు. కార్పొరేషన్ సిబ్బందిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని వస్తుంటే కనీసం రెండు రోజులు మా జెండాలు కట్టుకోనివ్వరా అంటూ చిందులు తొక్కారు. పార్టీ జెండాలు కట్టుకునే హక్కు కూడా లేదా అంటూ ప్రశ్నించారు.

ఎవరి పర్యటన..? ఎవరిది హడావిడి..?

ప్రధాని పర్యటనను మొదటినుంచీ వైసీపీ హైజాక్ చేసింది. బీజేపీ కంటే ముందే వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి టైంటేబుల్ చెప్పేశారు. ఆ తర్వాత తీరిగ్గా ప్రెస్ మీట్ పెట్టిన ఏపీ బీజేపీ నేతలు, అసలు వైసీపీకి సంబంధం ఏంటని నిలదీశారు. ఇక ప్రధానికి స్వాగత సత్కారాలు చేసే విషయంలో కూడా వైసీపీ నేతలు ఎక్కడలేని స్వామిభక్తి చాటుకున్నారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. అందరూ క్యూ కట్టి చేతులు జోడించి ప్రధానికి సవినయంగా నమస్కరించారు. ఇక్కడ కూడా వైసీపీ డామినేషన్ ని బీజేపీ తట్టుకోలేకపోయింది. మా జెండాలు కట్టుకోనివ్వలేదు, ప్రధాని పర్యటనలో మాకు ప్రయారిటీ లేకుండా చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఉడుక్కుంటున్నారు. చూస్తుంటే ప్రధాని మా పార్టీయేనని వైసీపీ నేతలు చెప్పుకుంటారేమోనంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.

First Published:  12 Nov 2022 4:14 AM GMT
Next Story