Telugu Global
Andhra Pradesh

పాదయాత్రకే కాదు, సీపీఎస్ హామీకి కూడా ఐదేళ్లు..

ప్రజా సంకల్ప యాత్రకు ఐదేళ్లంటూ వైసీపీ హడావిడి చేస్తుంటే, సీపీఎస్ హామీకి కూడా ఐదేళ్లొచ్చాయంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. సోషల్ మీడియాలో సీపీఎస్ రద్దు హామీకి ఐదేళ్లంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు.

పాదయాత్రకే కాదు, సీపీఎస్ హామీకి కూడా ఐదేళ్లు..
X

ప్రతిపక్ష నేతగా 2017లో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. ఆ యాత్రకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల వైసీపీ నేతలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. యాత్రలోని మధుర ఘట్టాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. యాత్రలో జగన్ తో పాటు పాల్గొన్న వారికి సన్మానాలు, సత్కారాలు చేశారు. అయితే యాత్రతోపాటు, ప్రజల మధ్యకు వచ్చిన సమయంలో జగన్ ఇచ్చిన హామీలకు కూడా ఐదేళ్లొచ్చాయని గుర్తు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు.

సీపీఎస్ సంగతేంటి..?

పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీల్లో అతి ముఖ్యమైనది సీపీఎస్ రద్దు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని తిరిగి మొదలు పెడతామంటూ ఉద్యోగులకు హామీ ఇచ్చారు జగన్. కానీ అది సాధ్యం కాలేదు. మూడేళ్లుగా చర్చలు జరుగుతున్నా ఉపయోగం లేదు. రేపు, మాపు అంటూ దాటవేస్తున్నారు కానీ, ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగిపోతుందనే ఉద్దేశంతో ఆ ఒక్క హామీని దూరంగా పెట్టారు. సంపూర్ణ మద్యపాన నిషేధం గురించి పెద్దగా జనం ఆలోచించట్లేదు కానీ, సీపీఎస్ సంగతి ఏమైందంటూ ఉద్యోగులు పదే పదే ముల్లులా ప్రభుత్వాన్ని గుచ్చుతున్నారు.

తాజాగా ప్రజా సంకల్ప యాత్రకు ఐదేళ్లంటూ వైసీపీ హడావిడి చేస్తుంటే, సీపీఎస్ హామీకి కూడా ఐదేళ్లొచ్చాయంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. సోషల్ మీడియాలో సీపీఎస్ రద్దు హామీకి ఐదేళ్లంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు. ప్రజా సంకల్పానికి ఐదేళ్లు – సీపీఎస్ రద్దు హామీకి ఐదేళ్లు అంటూ రెండిటి మధ్య పోలిక పెడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు ఉద్యోగులు. ఐదేళ్లుగా ఈ హామీకి అతీగతీ లేదని సెటైర్లు పేలుస్తున్నారు.

ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం సీపీఎస్ వ్యవహారంలో సానుకూల నిర్ణయం ఉంటుందని ప్రకటించింది. మధ్యేమార్గంగా తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ని కూడా ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం మరోసారి ఆలోచనలో పడింది. వచ్చే ఎన్నికలనాటికి ఉద్యోగులనుంచి ఇది ప్రధాన డిమాండ్ గా మారే అవకాశముంది.

First Published:  7 Nov 2022 11:48 AM GMT
Next Story