Telugu Global
Andhra Pradesh

ఆ ఐదు గ్రామాలు ఏపీలోనే ఉంటాయట..?

అయితే గ్రామవాసులంతా తీర్మానం చేశారంటున్నారు కాబట్టి, దాన్ని మరీ కొట్టిపారేయలేం. ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు మాత్రం ఆంధ్రాలోనే ఉంటామని స్పష్టం చేయడం విశేషం.

ఆ ఐదు గ్రామాలు ఏపీలోనే ఉంటాయట..?
X

గోదావరి వరదల తర్వాత తమను ఏపీ ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదని, తాము తెలంగాణలోనే ఉంటామంటూ ఐదు గ్రామాల ప్రజలు తీర్మానం చేసినట్టు వార్తలొచ్చాయి. వాస్తవానికి ఆ ఐదు గ్రామాల ప్రజలకు జిల్లా కేంద్రం దూరంగా ఉండటంతో సహాయక చర్యల విషయంలో, ప్రభుత్వ అధికారుల సత్వర స్పందన విషయంలో ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. పక్కనే ఉన్న తెలంగాణ నుంచి వారికి సత్వర సాయం అందిన మాట కూడా వాస్తవమే. అయితే అంతమాత్రాన ఈ రాష్ట్రం మాకొద్దు, ఆ రాష్ట్రం కావాలంటూ ఆ ఐదు గ్రామాల ప్రజలు భీష్మించుకు కూర్చున్నారని అనలేం. అయితే గ్రామవాసులంతా తీర్మానం చేశారంటున్నారు కాబట్టి, దాన్ని మరీ కొట్టిపారేయలేం. ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు మాత్రం ఆంధ్రాలోనే ఉంటామని స్పష్టం చేయడం విశేషం.

ఎటపాక మండలంలోని కన్నాయిగూడెం, పురుషోత్తమ పట్నం, గుండాల గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు పురుషోత్తమ పట్నంలో ఓ మీటింగ్ పెట్టుకున్నారు. వైసీపీ నేతలతో కలసి వారు మీడియాతో మాట్లాడారు. పంచాయతీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ.. అందరూ కలసి తామంతా ఏపీలోనే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. మా ఐదు పంచాయతీలు తెలంగాణలోనే ఉంటాయి, ఆంధ్రా ముద్దు తెలంగాణ వద్దు.. అనే బ్యానర్లు పట్టుకుని ఫొటోలు దిగారు నేతలు.

సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికీ అందుతున్నాయని చెప్పారు ఎటపాక మండలవాసులు. జిల్లాల పునర్విభజన సమయంలో జిల్లా కేంద్రం పాడేరు తమకు దూరమవుతుందని, విలీన మండలాల పాలనా సౌలభ్యం కోసం గతంలో కొంతమంది తీర్మానాలు చేశారని, అయితే ఆ నాటి తీర్మానాల్లో కొందరి సంతకాలు ఫోర్జరీ చేసి ఇప్పుడు వాటిని వక్రీకరించి చూపిస్తున్నారని వారు మండిపడ్డారు. తామందరికీ ఏపీలో ఉండటం సంతోషంగానే ఉందని, తాము తెలంగాణలో కలవాలని అనుకోవట్లేదని తేల్చి చెప్పారు. భద్రాచలంలోని కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, వారి వ్యాపారం కోసం 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలనే వాదన తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. మార్పులు చేర్పులు సాధ్యమయ్యేట్టయితే, భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలని వారు డిమాండ్‌ చేశారు.

First Published:  23 July 2022 9:27 AM GMT
Next Story