Telugu Global
Andhra Pradesh

ఏపీలో చేపల బండ్ల కేటాయింపు మొదలు..

ఇప్పటికే మొబైల్ రేషన్ వాహనాలతో సరకులను ఇంటి వద్దకే తెచ్చి ఇస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేసి, చికెన్, మటన్, మత్స్య ఉత్పత్తులను కూడా ఇంటి వద్దకే తెచ్చి అమ్మే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇది పూర్తిగా లబ్ధిదారుల వ్యాపారం.

ఏపీలో చేపల బండ్ల కేటాయింపు మొదలు..
X

జగనన్నను ఉద్యోగాలడిగితే, చేపల బండ్లు, చికెన్ బండ్లు ఇస్తున్నారంటూ ఆమధ్య సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ నడిచింది. ఆ దెబ్బతో ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గినా.. ఇప్పుడు చేపల బండ్లను తెరపైకి తెచ్చింది. తొలి కేటాయింపు పూర్తయింది. ఫిష్ వెండింగ్ వెహికల్స్ అనే పేరుతో తొలి వాహనాన్ని మత్స్య శాఖ కమిషనర్‌ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన ఉప్పుల సుందరరావు అనే లబ్ధిదారుడికి అందజేశారు. తొలి విడతలో 300 త్రీ వీలర్, 150 ఫోర్‌ వీలర్‌ వాహనాలు అందించేందుకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం.

ఎవరెవరికి ఇస్తారు..?

నిరుద్యోగ యువతకు 40 నుంచి 60 శాతం సబ్సిడీపై మొబైల్‌ త్రీ వీలర్‌ ఫిష్‌ వెండింగ్‌ కార్ట్స్, ఫోర్‌ వీలర్‌ మొబైల్‌ ఫిష్‌ అండ్‌ ఫుడ్‌ వెండింగ్‌ వెహికల్స్‌ అందజేస్తోంది ఏపీ ప్రభుత్వం. మూడు చక్రాల వాహనం ధర 4 లక్షల రూపాయలు. ఫోర్ వీలర్ ధర 12 లక్షలనుంచి 23 లక్షల వరకు ఉంటుంది. వీటిపై ఎస్సీ, ఎస్టీలతోపాటు మహిళా లబ్ధిదారులకు 60 శాతం సబ్సిడీ ఇస్తారు. ఇతర వర్గాల వారు వాహనం తీసుకోవాలంటే 40 శా¬తం సబ్సిడీ ఇస్తారు. వాహనం ధరలో 10 శాతం లబ్ధిదారులు చెల్లిస్తే.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా సమకూరుస్తుంది.

వాహనం ప్రత్యేకతలు..

ఇప్పటికే మొబైల్ రేషన్ వాహనాలతో సరకులను ఇంటి వద్దకే తెచ్చి ఇస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేసి, చికెన్, మటన్, మత్స్య ఉత్పత్తులను కూడా ఇంటి వద్దకే తెచ్చి అమ్మే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇది పూర్తిగా లబ్ధిదారుల వ్యాపారం. నిరుద్యోగులకు ఉపయోగపడేలా ప్రభుత్వం వాహనాలను సబ్సిడీపై సమకూరుస్తోంది, బ్యాంకు రుణం కూడా మంజూరయ్యేలా చేస్తోంది. మూడు చక్రాల వాహనంలో 200 కేజీల మత్స్య ఉత్పత్తులు నిల్వ చేసుకునే వీలుంది. ఐస్ బాక్స్ లు, బరువు తూచుకునే మిషన్లు, ప్రచారానికి మైక్ ఇందులో ఉంటాయి.

ఇక ఫోర్ వీలర్లలో మరిన్న అదనపు సౌకర్యాలుంటాయి. 2 నుంచి 8 టన్నుల వరకు ఇందులో మత్య్స ఉత్పత్తులను నిల్వ చేసుకోవచ్చు. చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య ఉత్పత్తులను, తినడానికి రెడీగా ఉన్న ఉత్పత్తులను కూడా విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు. వీటితోపాటు ఇతర స్నాక్స్ కూడా అందులో విక్రయించుకోవచ్చు. నిరుద్యోగులతోపాటు, ఆయా రంగంలో స్థిరపడాలనుకుంటున్న వారికి ఈ వాహనాలు ఉపయోగపడే అవకాశముంది.

First Published:  3 Jan 2023 4:19 AM GMT
Next Story