Telugu Global
Andhra Pradesh

విజ‌య‌వాడ టీవీఎస్ షోరూమ్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం.. 300 వాహ‌నాలు ద‌గ్ధం

తొలుత షోరూమ్‌లోని మొద‌టి అంత‌స్తులో షార్ట్ స‌ర్క్యూట్ జ‌రిగి మంట‌లు చెల‌రేగాయి. అవి కొద్దిసేప‌టికే గోడౌన్‌కు కూడా విస్త‌రించాయి.

విజ‌య‌వాడ టీవీఎస్ షోరూమ్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం.. 300 వాహ‌నాలు ద‌గ్ధం
X

విజయవాడ టీవీఎస్ వాహనాల షోరూంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో షోరూమ్‌తో పాటు గోడౌన్‌లో ఉన్న సుమారు 300 వ‌ర‌కు బైక్‌లు ద‌గ్ధ‌మైన‌ట్టు స‌మాచారం. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలుస్తోంది. విజయవాడలోని చెన్నై-కోల్‌క‌తా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో ఈ షోరూం ఉంది. ఉమ్మ‌డి కృష్ణాజిల్లా ప‌రిధిలోని టీవీఎస్ షోరూమ్‌ల‌కు ఇదే ప్ర‌ధాన కార్యాల‌యం కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో వంద‌ల సంఖ్య‌లో వాహ‌నాల‌ను ఇక్క‌డి గోడౌన్‌లో ఉంచుతారు. ఒకే ప్రాంగణంలో గోడౌన్, షోరూం, సర్వీస్ సెంటర్ కూడా ఉండటంతో వందల సంఖ్యలో వాహనాలు అక్కడ ఉంటాయి.

తొలుత షోరూమ్‌లోని మొద‌టి అంత‌స్తులో షార్ట్ స‌ర్క్యూట్ జ‌రిగి మంట‌లు చెల‌రేగాయి. అవి కొద్దిసేప‌టికే గోడౌన్‌కు కూడా విస్త‌రించాయి. సెక్యూరిటీ గార్డులు వెంట‌నే గ‌మ‌నించి అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. దీంతో 3 ఫైరింజ‌న్లతో అక్క‌డికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంట‌లను అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించారు.

ప్రీఫ్యాబ్రిక్ పద్ధతిలో నిర్మించిన షోరూమ్ కావడంతో మంటలు వేగంగా విస్తరించినట్లు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. గోడౌన్‌లో సాధారణ టూ వీలర్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని తెలిపారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని విచార‌ణ చేప‌ట్టారు. పెట్రోల్ వాహనాలను ఉంచే గోడౌన్ సమీపంలోనే పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా పార్క్ చేసి ఉంచడం.. వాటిని చార్జింగ్ పెట్టడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి న‌ష్టం కోట్ల రూపాయ‌ల్లో ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

*

First Published:  24 Aug 2023 5:11 AM GMT
Next Story