Telugu Global
Andhra Pradesh

అదానీపై నమ్మకం లేదు.. ఎదురుతిరిగిన అనంత రైతులు

అదానీ గ్రూప్‌పై ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాము లీజు ఒప్పందాలపై సంతకాలు చేసి భూములను అప్పగించిన తర్వాత అదానీ సంస్థ లీజు సొమ్ము చెల్లించకపోతే తాము ఏం చేయగలమని ప్రశ్నిస్తున్నారు.

అదానీపై నమ్మకం లేదు.. ఎదురుతిరిగిన అనంత రైతులు
X

హిండెన్ బర్గ్ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత అదానీ గ్రూపున‌కు సంబంధించిన‌ పెద్దలకు నిద్ర కరువైంది. ఇక ఇప్పట్లో ప్రశాంత నిద్ర సాధ్యం కాకపోవచ్చు. 10 రోజుల క్రితం వరకు స్టాక్‌మార్కెట్‌లో రంకెలేసిన గ్రూప్ కంపెనీలు.. ఇప్పుడు స్టాక్‌ మార్కెట్లు ఎప్పుడు క్లోజ్ అవుతాయా..? మార్కెట్‌ క్లోజ్‌లో ఉండే వీకెండ్ ఎప్పుడొస్తుందా..! అని ఎదురు చూస్తున్నాయి. మార్కెట్‌ ఓపెన్ అయితే చాలు.. మెట్ల మీద నుంచి జారిపడినట్టు అదానీ షేర్లు ఫల్టీలు కొడుతూ పతనం అవుతున్నాయి.

కేవలం స్టాక్ మార్కెట్‌లోనే కాదు.. క్షేత్రస్థాయిలోనూ అదానీకి పరిస్థితులు ఎదురు తిరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉండటంతో మొన్నటి వరకు ఏపీ కూడా అదానీకి దాసోహం అయింది. పోర్టులను, భారీగా భూములను సొంతం చేసుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో సోలార్‌ ప్లాంట్‌ కోసం లీజు ప్రాతిపదికన ఏడు వేల 500 ఎకరాలను అదానీ సంస్థకు ఇచ్చేందుకు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించింది. 20ఏళ్లపాటు లీజుకు అప్పగించినందుకు గాను.. ఏడాదికి ఎకరాకు రూ. 30వేల చొప్పున చెల్లించేందుకు అదానీ గ్రూప్‌ సిద్ధమైంది. బడా కంపెనీ అనుకుని రైతులు కూడా ముందుకొచ్చారు. ఇప్పటికే గ్రామ సభలు పెట్టి రైతులను అధికారులు ఒప్పించారు. రైతులకు, అదానీ గ్రూప్‌కు మధ్య రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించింది.

ఇప్పుడు అదానీ ప‌త‌నం మొద‌ల‌వ్వ‌డంతో భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. అదానీ గ్రూప్‌పై ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాము లీజు ఒప్పందాలపై సంతకాలు చేసి భూములను అప్పగించిన తర్వాత అదానీ సంస్థ లీజు సొమ్ము చెల్లించకపోతే తాము ఏం చేయగలమని ప్రశ్నిస్తున్నారు. ఆ సంస్థలతో న్యాయపోరాటాలు చేయాల్సి వస్తుందని.. అంత అవసరం తమకేంటని ప్రశ్నిస్తున్నారు.

లీజు సొమ్ము చెల్లింపు బాధ్యతను అదానీ సంస్థకు వదిలేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకుంటే అప్పుడు మాత్రమే తాము భూములు ఇస్తామని తెగేసి చెబుతున్నారు. అదానీ సంస్థే డబ్బులు చెల్లిస్తుందంటే నమ్మే ప్రసక్తే లేదంటున్నారు. సో.. అదానీ సోలార్ ప్లాంట్‌ ముందుకెళ్లడం కష్టమే. ఒకవేళ అదానీ తన పలుకుబడిని ఉపయోగించి లీజు చెల్లించే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం నెత్తినే వేసి భూములు తీసుకుంటారేమో!. మోడీకి సన్నిహితుడైన అదానీ అడిగితే కాదనే సాహసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా?.

First Published:  5 Feb 2023 3:21 AM GMT
Next Story