Telugu Global
Andhra Pradesh

పీఎం కిసాన్ సాయం అందక ఇబ్బందులు.. కేంద్రం నిబంధనలతో రైతులకు నష్టం

కేంద్రం ఒకేసారి లక్ష మందికి పైగా రైతులకు పెట్టుబడి సాయాన్ని నిలిపివేసింది. ఇక ఈ ఏడాది రెండో విడతలో 42 లక్షల మందికే సాయం ఇచ్చింది. అంటే ఏకంగా 4 లక్షలకు పైగా రైతులకు పీఎం కిసాన్ నిధులు అందలేదు.

పీఎం కిసాన్ సాయం అందక ఇబ్బందులు.. కేంద్రం నిబంధనలతో రైతులకు నష్టం
X

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో అర్హులకు డబ్బు అకౌంట్లో వేస్తోంది. పంట వేసే ముందు రైతులు అప్పులు చేయకుండా ప్రభుత్వమే వారికి సాయం అందిస్తుండటం వారికి కలసి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో ఏపీలోని రైతు భరోసాను లింక్ చేశారు. కేంద్రం ఇచ్చే రూ. 6వేల సాయానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 7,500 కలిపి మొత్తం రూ. 13,500 సాయం అందిస్తోంది. అయితే కేంద్రం తరచూ ఈ పథక నిబంధనలో మార్పులు చేస్తుండటంతో ఏపీలో లబ్దిదారులు తగ్గిపోతున్నారు.

కేంద్రం ఇచ్చే రూ. 6 వేలను కూడా మూడు కిస్తీల్లో చెల్లిస్తోంది. ప్రతీ సారి రూ. 2 వేల చొప్పున రైతుల అకౌంట్లో జమ చేస్తోంది. అయితే పలు కారణాల వల్ల కేంద్రం నుంచి సాయం అందుకునే రైతుల సంఖ్య తగ్గిపోతోంది. ఏడాదిలో నాలుగు నెలలను ఒక పిరియడ్‌గా పేర్కొంటు మూడు సార్లు ఈ సాయం వేస్తోంది. ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చిగా విభజించి డబ్బు జమ చేస్తున్నారు. 2021-22 ఏడాదికి డిసెంబర్-మార్చి కాలానికి 47,64,482 మందికి రూ. 2వేల చొప్పున అకౌంట్లలో జమ చేశారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ - జూలై కిస్తీ మాత్రం 46,62,768 మందికి మాత్రమే లభించింది.

కేంద్రం ఒకేసారి లక్ష మందికి పైగా రైతులకు పెట్టుబడి సాయాన్ని నిలిపివేసింది. ఇక ఈ ఏడాది రెండో విడతలో 42 లక్షల మందికే సాయం ఇచ్చింది. అంటే ఏకంగా 4 లక్షలకు పైగా రైతులకు పీఎం కిసాన్ నిధులు అందలేదు. సాయం కావల్సిన ప్రతీసారి రైతులకు కొత్త నిబంధనలు విధిస్తుండటంతో చాలా మంది అప్లై చేసుకోలేక పోతున్నారు. ఇక తాజాగా కేవైసీ నిబంధనను అమలు చేయాలని భావిస్తోంది. అదే జరిగితే మరింత మంది లబ్దిదారులు తగ్గిపోయే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఏపీలో పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులు దాదాపు 60 లక్షల మంది ఉన్నారు. కానీ వీరిలో 10 లక్షల -15 లక్షల మంది రైతులకు అసలు సాయం అందడం లేదు. కేంద్రం కేవలం సొంత భూమి ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అమలు చేస్తుండటంతో కౌలు రైతులు దూరమవుతున్నారు. అంతే కాకుండా రోజుకో నిబంధనల పెడుతుండటం, సాంకేతిక కారణాల వల్ల చాలా మంది సమయానికి అప్లై చేసుకోకపోవడంతో పీఎం కిసాన్ లబ్దిదారుల సంఖ్య ప్రతీసారి గణనీయంగా తగ్గిపోతున్నది.

ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో మరో రూ. 7,500 కలిపి అందిస్తోంది. పీఎం కిసాన్ సాయం అందే రైతులకు పూర్తి రూ. 13,500 అకౌంట్లలో జమ అవుతోంది. కానీ మిగిలిన వారికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కింద రూ. 7,500 మాత్రమే వస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. కేంద్రం ఇవ్వని వారికి రాష్ట్రమే మిగిలిన రూ. 6వేలు జమ చేసి ఇవ్వాలని కోరుతున్నారు. కానీ, అలా ఇస్తే పథకం గందరగోళంగా మారిపోతుందని ప్రభుత్వం అంటోంది. వ్యవసాయ అధికారులు పీఎం కిసాన్‌కు సంబంధించి రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తే మిగిలిన రూ. 6వేలు కూడా వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

First Published:  1 Dec 2022 1:19 AM GMT
Next Story