Telugu Global
Andhra Pradesh

ఏపీలో ఫ్యామిలీ డాక్టర్.. ఆగస్ట్ 1 నుంచి ట్రయల్ రన్..

656 MMUలకు అదనంగా 432 కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. వీటి ద్వారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలులోకి వస్తుంది.

ఏపీలో ఫ్యామిలీ డాక్టర్.. ఆగస్ట్ 1 నుంచి ట్రయల్ రన్..
X

ఏపీలో పేదలకోసం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని తెరపైకి తెస్తోంది జగన్ సర్కారు. ఆగస్ట్ 1 నుంచి దీనికి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఆగస్ట్ 15నుంచి పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని పట్టాలెక్కిస్తారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న 104 అంబులెన్స్ పథకానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫ్యామిలీ డాక్టర్ గా అందుబాటులోకి తెస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వాటితోపాటు 104 వాహనాలు కూడా ఉన్నాయి, వీటిని మొబైల్ మెడికల్ యూనిట్ (MMU) అంటారు. నెలలో ఓసారి ఈ వాహనాలు సచివాలయాల పరిధిలో సేవలు అందిస్తుంటాయి. ఆయా గ్రామ సచివాలయాల వద్ద 104 వాహనాలను నెలలో ఓరోజు అందుబాటులో ఉంచుతారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ చూస్తారు, మధ్యాహ్నం నుంచి 104 వాహనంలో డాక్టర్ ఊరిలోకి వెళ్తారు. ఇల్లు కదలలేని రోగులు, వృద్ధుల వద్దకు అదే వాహనంలో వెళ్లి పరీక్షలు చేస్తారు, మందులు అందిస్తారు. ఇకపై ఈ వాహనాల సంఖ్య పెంచబోతోంది ప్రభుత్వం. 656 MMUలకు అదనంగా 432 కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. వీటి ద్వారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలులోకి వస్తుంది. ఆగస్ట్ 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్‌ రన్‌ ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఆగస్ట్ 15నుంచి ఈ కార్యక్రమం అమలులోకి వస్తుంది.

ప్రస్తుతం గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో భాగంగా పి.హెచ్.సి. లలో పనిచేసే ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలో ఉన్న సచివాలయాలను కేటాయిస్తారు. ఒక వైద్యుడు ఆస్పత్రిలో ఉంటే, ఇంకో వైద్యుడు 104 వాహనంలో గ్రామంలోకి వెళ్లి సేవలందిస్తారు. ఆ డాక్టర్ తోపాటు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ లోని మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, సచివాలయ ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌ కూడా 104 వాహనం ద్వారా గ్రామంలోకి వెళ్తారు. ఏ వాహనం ఏరోజు, ఏ సచివాలయ పరిధిలో ఉంటుందో ముందుగానే ప్రకటిస్తారు. ఇలా గ్రామంలోని ప్రతి ఒక్కరి ఇంటికి డాక్టర్ వెళ్లేలాగా ఈ కార్యక్రమం రూపొందించారు. మెరుగైన వైద్యం అవసరం అని డాక్టర్ భావిస్తే, దగ్గరలోని పెద్దాసుపత్రి, ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్‌ ఆస్పత్రికి వారే రిఫర్‌ చేస్తారు. ఏఎన్ఎం సహాయంతో ఆ రోగిని 108 ద్వారా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తారు. ఇలా ప్రతి ఇంటికి నెలలో రెండుసార్లు డాక్టర్ వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు.

First Published:  28 July 2022 6:16 AM GMT
Next Story