Telugu Global
Andhra Pradesh

భోగాపురం: ఏమీ లేకుండానే టెంకాయ కొట్టిన చంద్రబాబు, జగన్‌ వచ్చాక...

చంద్రబాబు లాగా ఏమీ లేకుండా శూన్యంలో సృష్టించడం జగన్‌కు నచ్చని విషయం. అన్ని అనుమతులనూ సంపాదించి, భూసేకరణ చేసి 2,203 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణానికి వైఎస్‌ జగన్‌ 2023 మేలో శంకుస్థాపన చేశారు.

భోగాపురం: ఏమీ లేకుండానే టెంకాయ కొట్టిన చంద్రబాబు, జగన్‌ వచ్చాక...
X

భోగాపురం విమానాశ్రయం గురించి టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అనుకూల మీడియా అర్థసత్యాలను, అసత్యాలను సిగ్గు ఎగ్గు లేకుండా రాసుకుంటూ పోతున్నది. భోగాపురం విమానాశ్రయం గురించిన వాస్తవాలను పరిశీలిస్తే జరిగింది ఇదా అని ముక్కున వేలు వేసుకోకతప్పదు.

చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో భోగాపురం విమానాశ్రయానికి ఏ విధమైన అనుమతులు లేకుండానే, భూసేకరణ చేయకుండానే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఎన్నికలు సమీపించడంతో అప్పట్లో ఆయన హడావిడి చేశారు. కేంద్రంలో తన అనుచరుడు, టిడిపి నేత అశోక్‌ గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ చంద్రబాబు తన హయాంలో భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఒక్క అనుమతి కూడా తేలేకపోయారు.

చంద్రబాబు లాగా ఏమీ లేకుండా శూన్యంలో సృష్టించడం జగన్‌కు నచ్చని విషయం. అన్ని అనుమతులనూ సంపాదించి, భూసేకరణ చేసి 2,203 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణానికి వైఎస్‌ జగన్‌ 2023 మేలో శంకుస్థాపన చేశారు. ఆ మరుక్షణం నుంచే పనులు వేగం పుంజుకున్నాయి. 2025 నుంచి ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుంది.

విమానాశ్రయ నిర్మాణానికి జగన్‌ ప్రభుత్వం జీఎంఆర్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. నిజానికి, ఒప్పందం చేసుకునేనాటికి కేవలం 377 ఎకరాలు మాత్రమే సేకరించారు. అయితే, ఆ తర్వాత జగన్‌ ప్రభుత్వం మిగతా భూమిని సేకరించి 2,203 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించడానికి పునాదులు వేసింది. జగన్‌ ప్రభుత్వం 376 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాలకు పునరావాసం కూడా కల్పించింది.

పునరావాసం కోర్టు కేసుల్లోనూ, పర్యావరణానికి సంబంధించి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటీ)లో వేసిన కేసుల్లోనూ జగన్‌ ప్రభుత్వం పోరాడి విజయం సాధించింది. దాంతో భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగి పనులు సజావుగా సాగుతున్నాయి.

పెట్టుబడులు ఇవీ...

ఇక్కడే జగన్‌ ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడుల గురించి కూడా మాట్లాడుకుందాం. విశాఖపట్నంలో 2023 మార్చిలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్ట పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌లో ఒక్క ప‌రిశ్ర‌మ‌ శాఖ ద్వారానే 99 ఒప్పందాలు జరిగితే ఇప్పటికే 78 యూనిట్లు పనులు ప్రారంభించాయి. మరో 21 ఒప్పందాలకు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో భారీ పెట్టుడులు రూ.60 వేల కోట్లు రాగా, జగన్‌ ప్రభుత్వ హయాంలో రూ,.70 వేల కోట్లు వచ్చాయి. అదే విధంగా జగన్‌ పాలనలో 3.94 లక్షల ఎంఎస్‌ఎంఈల ఏర్పాటు జరిగింది. తద్వారా రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

అబద్ధాలు ఎన్ని చెప్పినా నిజాలు బయటకు రాకుండా పోవు. ఈ కనీసమైన విషయం ఎల్లో మీడియాకు ఎందుకు తెలియదనేది ఆశ్చర్యం. నిజాలు ఏవైతేనేం ఇప్పటికిప్పుడు పబ్బం గడుపుకుంటే చాలని అనుకుంటూ ఉండవచ్చు. ఎన్ని చెప్పినా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారనే విషయాన్ని గ్రహిస్తే మంచిది.

First Published:  27 Jan 2024 8:25 AM GMT
Next Story