Telugu Global
Andhra Pradesh

ఏపీలో జనవరి 1 నుంచి ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు

ఇతర వ్యాపారాలున్న కొందరు ఉద్యోగులు సుదీర్ఘకాలం సెలవులో ఉండటం, విధులకు తిరిగి కొద్ది రోజుల పాటు హాజరవ్వ‌డం.. మళ్లీ సుదీర్ఘంగా లీవ్ పెట్టడం చేస్తున్న వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.

ఏపీలో జనవరి 1 నుంచి ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు
X

జనవరి ఒకటి నుంచి ఏపీ ఉద్యోగుల హాజరుపై కీలక మార్పులు చేస్తోంది ప్రభుత్వం. ఉద్యోగులందరికీ రేపటి నుంచి ముఖ గుర్తింపు ఆధారిత హాజరును అమలు చేయనుంది. జనవరి ఒకటి నుంచి సచివాలయం, హెచ్‌వోడీలు, జిల్లా కార్యాలయాల్లో అమలు చేస్తారు. మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల్లో జనవరి 16 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది. నిర్ణీత సమయం కంటే పది నిమిషాలు ఆలస్యం వరకు వెసులుబాటు ఇవ్వనున్నారు. పది నిమిషాలకు మించి నెలలో మూడు సార్లు ఆలస్యంగా వస్తే ఆ తర్వాత ఆలస్యంగా వచ్చిన రోజును ఆఫ్ డే లీవ్‌గా పరిగణిస్తారు.

ఇప్పటి వరకు విధులకు పదేపదే డుమ్మా కొడుతున్న ఉద్యోగుల వివరాలను ఆయా శాఖలు సేకరిస్తున్నాయి. ఇతర వ్యాపారాలున్న కొందరు ఉద్యోగులు సుదీర్ఘకాలం సెలవులో ఉండటం, విధులకు తిరిగి కొద్ది రోజుల పాటు హాజరవ్వ‌డం.. మళ్లీ సుదీర్ఘంగా లీవ్ పెట్టడం చేస్తున్న వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అలాంటి వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ముఖ ఆధారిత హాజరు ప్రక్రియ వల్ల పనితీరు మెరుగుపడే అవకాశం అయితే ఉంది. పనిదొంగలకు మాత్రం ఈ మార్పులు మింగుడుపడటం లేదు.

ఆర్టీసీలో కూడా జనవరి ఒకటి నుంచి ముఖ ఆధారిత హాజరు అమలుకు ఎండీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటో తేదీ నుంచి ప్రధాన కార్యాలయంలో.. జనవరి 16 నుంచి జిల్లా కార్యాలయాలు, డీపోలు, యూనిట్లలో ముఖ ఆధారిత హాజరు పక్రియ అమలులోకి వస్తుందని ఆర్టీసీ ప్రకటించింది.

First Published:  31 Dec 2022 3:17 AM GMT
Next Story