Telugu Global
Andhra Pradesh

ఆ యాప్ తో ఈజీగా పట్టేస్తారు.. ఏపీ టీచర్లు లబోదిబో..

ఉపాధ్యాయులు మాత్రం ఉత్సాహంగా ఉన్నారు. గతంలో కూడా పోలీసులు అడ్డుకున్నా ఛ‌లో విజయవాడను విజయవంతం చేసి ప్రభుత్వానికి తమ సత్తా చూపించారు ఉద్యోగులు. అందులో ఉపాధ్యాయుల పాత్ర ప్రత్యేకం. కానీ ఈసారి ఉపాధ్యాయుల‌కు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అడ్డుగా మారింది.

ఆ యాప్ తో ఈజీగా పట్టేస్తారు.. ఏపీ టీచర్లు లబోదిబో..
X

ఫిబ్రవరిలో జరిగిన విజయవాడ ముట్టడి కార్యక్రమానికి ఉద్యోగులు మారు వేషాల్లో వచ్చారు. చేతిలో సంచితో సామాన్యుడిలాగా, పంచె కట్టుకుని రైతులాగా, నామాలు పెట్టుకుని పూజారిలాగా.. ఇలా రకరకాల వేషాలతో ఉపాధ్యాయులు విజయవాడ వెళ్లినట్టు ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. పోలీసుల కళ్లుగప్పి వెళ్లిన ఉపాధ్యాయుల్ని అప్పట్లో స్థానికంగా హీరోలుగా చూశారు. కానీ ఇప్పుడా వేషాలేవీ పనిచేసేట్టుగా లేవు. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వచ్చాక ఉపాధ్యాయుల డేటా అంతా ఆన్ లైన్ లో ఉండిపోయింది. దాన్ని తాత్కాలికంగా పోలీస్ డిపార్ట్ మెంట్ కి యాక్సెస్ ఇస్తోంది ప్రభుత్వం. అంటే ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమ సెల్ ఫోన్ తో వారిని ఫొటో తీస్తే.. ప్రభుత్వ ఉపాధ్యాయుడైతే కచ్చితంగా వారి వివరాలన్నీ బయటకొచ్చేస్తాయి. అంటే.. నేను రైతుని, నేను కూలీని, నేను ఫలానా వ్యక్తిని అంటూ ఉపాధ్యాయులు ఇకపై అబద్ధాలు చెప్పలేరు, పోలీసులకు తెలియకుండా ప్రయాణం చేయలేరు.

సెప్టెంబర్ 1న విజయవాడలో తలపెట్టిన మిలియన్ మార్చ్ ని విజయవంతం చేయాలని, సీఎం జగన్ ఇంటిని ముట్టడించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. సీపీఎస్ చర్చలు విఫలం కావడంతో ఈ కార్యక్రమాన్ని కచ్చితంగా సక్సెస్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు ఉద్యోగులు. మరోవైపు దీన్ని ఎలాగైనా నిలువరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పోలీస్ ఫోర్స్ ని రంగంలోకి దింపింది. మూడు రోజుల ముందుగానే పోలీసులు విజయవాడలో పహారా మొదలు పెట్టారు. సెప్టెంబర్ 1న వీధుల్లో ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టకూడదని 144 సెక్షన్ విధించారు, నోటీసులిస్తున్నారు, పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నారు.

కానీ గత అనుభవంతో ఉపాధ్యాయులు మాత్రం ఉత్సాహంగా ఉన్నారు. గతంలో కూడా పోలీసులు అడ్డుకున్నా ఛ‌లో విజయవాడను విజయవంతం చేసి ప్రభుత్వానికి తమ సత్తా చూపించారు ఉద్యోగులు. అందులో ఉపాధ్యాయుల పాత్ర ప్రత్యేకం. కానీ ఈసారి ఉపాధ్యాయుల‌కు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అడ్డుగా మారింది. మిగతా ఉద్యోగుల వివరాలు బయటకొచ్చేందుకు కాస్త సమయం పడుతుంది కానీ, ఉపాధ్యాయుల్ని నిలబెట్టి మరీ వారి పుట్టుపూర్వోత్తరాలు చెప్పేస్తారు. ఈ యాప్ ని పోలీసులకు యాక్సెస్ ఇచ్చారనే ప్రచారంతో ఉపాధ్యాయులు వెనక్కు తగ్గుతారని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధ్యాయులు నిజంగానే వెనక్కు తగ్గుతారా..? లేక అడ్డంకుల్ని దాటి మరీ ఛ‌లో విజయవాడ విజయవంతం చేస్తారా..? వేచి చూడాలి.

First Published:  29 Aug 2022 2:39 AM GMT
Next Story