Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఏమిచేస్తారో..పెరిగిపోతున్న ఆసక్తి

ఎన్నికల్లో చంద్రబాబు ఏమిచేయబోతున్నారన్నది కీలకంగా మారింది. రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ నేతలకు ఎందుకు ఈజీగా గెలిచే అవకాశం ఇవ్వాలని అనుకుంటే కచ్చితంగా ఒకళ్ళని పోటీలోకి దింపుతారు.

చంద్రబాబు ఏమిచేస్తారో..పెరిగిపోతున్న ఆసక్తి
X

రాబోయే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఏమి చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. రాబోయే ఎన్నికలంటే సాధారణ ఎన్నికలు కాదు అంతకన్నాముందే జరగబోతున్న రాజ్యసభ ఎన్నికలు. ఏప్రిల్‌లో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రిటైర్ కాబోతున్నారు. వైసీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, టీడీపీ తరఫున ఎన్నికైన కనకమేడల రవీంద్ర, సీఎం రమేష్ పదవీ కాలం ముగింపున‌కు వచ్చేసింది. వీళ్ళ స్థానాల్లో కొత్తవారిని ఎంపికచేయటానికి కేంద్ర ఎన్నికల కమిషన్ తొందరలోనే నోటిఫికేషన్ జారీచేయబోతోంది.

ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మూడు సామాజికవర్గాల నుంచి ముగ్గురు నేతలను ఎంపిక చేయబోతున్నారని పార్టీవర్గాల సమాచారం. పాయకరావుపేట ఎమ్మెల్యే (ఎస్సీ) గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే(కాపు) ఆరణి శ్రీనివాస్‌కు ఛాన్స్ దక్కబోతోందనే టాక్ పెరిగిపోతోంది. జనరల్ ఎన్నికలకు ముందు భర్తీ చేయబోయే రాజ్యసభ అభ్యర్థుల్లో ఒక ఎస్సీ, ఒక కాపుకు జగన్ అవకాశం ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఉన్నవారిలో బీసీలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్ర‌కారం చూసుకుంటే వైసీపీ తరఫున ముగ్గురు అభ్యర్థులు ఎంపికవటం చాలా తేలిక.

అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఏమిచేయబోతున్నారన్నది కీలకంగా మారింది. రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ నేతలకు ఎందుకు ఈజీగా గెలిచే అవకాశం ఇవ్వాలని అనుకుంటే కచ్చితంగా ఒకళ్ళని పోటీలోకి దింపుతారు. ఆమధ్య జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలాగే పంచుమర్తి అనూరాధను పోటీలోకి దింపి గెలిపించుకున్నారు. అప్పుడంటే చంద్రబాబు ఎత్తుపారింది. అప్పటికే వివిధ కారణాలతో జగన్ కు ఎదురుతిరిగిన నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడుకుని వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు.

కానీ, ఇప్పుడు అలా సాధ్యంకాదు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలంటే ఒక అభ్యర్థికి 40 మంది ఎమ్మెల్యేలు ఓట్లేయాలి. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచింది 23 మంది ఎమ్మెల్యేలే అయినా ఇప్పుడున్నది 19 మందే. ఈ 19 మంది ఓట్లేసినా ఇంకా 21 మంది ఎమ్మెల్యేల ఓట్లవసరం. అంతమందితో క్రాస్ ఓటింగ్ చేయించుకోవటం చంద్రబాబుకు కష్టమే.

అయితే రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కనివాళ్ళు, నియోజకవర్గాలు మారటం ఇష్టంలేని వాళ్ళతో చంద్రబాబు బేరాలు మాట్లాడుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చంద్రబాబుతో చేతులు కలిపే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతమందుంటారో ఇప్పుడే చెప్పేందుకు లేదు. వైసీపీలో టికెట్లు దక్కనివాళ్ళందరికీ టీడీపీలో టికెట్లు ఇస్తానని హామీ ఇచ్చినా చంద్రబాబు ఇచ్చేస్తారు. హామీనే కాబట్టి అవసరానికి ఎన్నయినా అనేస్తారు. చంద్రబాబు ట్రాక్ రికార్డు తెలుసు కాబట్టే అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతోంది.

First Published:  10 Jan 2024 5:51 AM GMT
Next Story