Telugu Global
Andhra Pradesh

ఎల్లోమీడియాకు ప్రతిరోజూ పండగేనా..?

తెలంగాణలో షర్మిల పరిస్థితి చివరకు ఎటూ కాకుండా పోయింది. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లే. అందుకనే వెంటనే ఏపీ బాధ్యతలు షర్మిలకే అని మళ్ళీ ఎల్లోమీడియా గోల మొదలుపెట్టింది.

ఎల్లోమీడియాకు ప్రతిరోజూ పండగేనా..?
X

జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జరిగే లేదా జరుగుతుందని అనుకుంటున్న ఒక్క చిన్న అవకాశాన్ని కూడా ఎల్లోమీడియా వదిలిపెట్టదు. ఎంతవీలుంటే అంతగా అవకాశాన్ని ఉపయోగించుకుని జగన్‌పై బురదచల్లేయటానికి రెడీ అయిపోతోంది. ‘ఏపీ పగ్గాలు షర్మిలకే’ అనే హెడ్డింగ్ తో బ్యానర్ కథనం అచ్చేసింది. విషయం ఏమిటంటే.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకోవటం ఖాయమట. దానివల్ల కాంగ్రెస్‌కు పూర్వవైభవం వచ్చేస్తుందని, దాంతో జగన్‌కు ఇబ్బందులు తప్పవన్నట్లుగా ఎల్లోమీడియా రెచ్చిపోయింది.

తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టక ముందునుండే ఎల్లోమీడియా ఆమెను విపరీతంగా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇంకేముంది తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టేయటం ఖాయం, ఏపీలో జగన్ పనైపోయిందని నానా రచ్చచేసింది. తెలంగాణలో షర్మిల పార్టీ పెడితే ఏపీలో జగన్‌కు ఎలా ఇబ్బందన్న చిన్న లాజిక్కును ఎల్లోమీడియా వదిలేసింది. అంటే ఇంతచిన్న విషయం ఎల్లోమీడియాకు తెలీకకాదు షర్మిలను ప్రమోట్ చేసింది. షర్మిలను అడ్డుపెట్టుకుని జగన్‌పై బురదచల్లేయటమే అసలు టార్గెట్.

అయితే చివరకు ఏమైందంటే.. తెలంగాణలో షర్మిల పరిస్థితి చివరకు ఎటూ కాకుండా పోయింది. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లే. అందుకనే వెంటనే ఏపీ బాధ్యతలు షర్మిలకే అని మళ్ళీ ఎల్లోమీడియా గోల మొదలుపెట్టింది. భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ సారథ్య‌ బాధ్యతలు షర్మిల తీసుకుంటే ఏమిటి..? తీసుకోకపోతే ఏమిటి..? వైఎస్సార్ వారసురాలిగా జనాలు షర్మిలకు గుర్తిస్తారని రాసుకొచ్చింది. ఆల్రెడీ వైఎస్సార్ వారసుడిగా జగన్ను జనాలు ఆద‌రించిన విషయాన్ని ఎల్లోమీడియా ప్రస్తావించలేదు.

నిజంగానే షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే ఎల్లోమీడియాకు పండగే పండగ. షర్మిల, విజయమ్మను అడ్డంపెట్టుకుని జగన్‌పై ప్రతిరోజు బురద చల్లేసేందుకు ఎల్లోమీడియా సిద్ధంగా ఉంటుంది. ఇప్పటివరకు షర్మిల తన అన్నగురించి ఎక్కడా వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అలాంటిది రేపు కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే తప్పనిసరిగా జగన్ను టార్గెట్ చేయాల్సిందే. అప్పుడు ఎల్లోమీడియాకు ప్రతిరోజు పండుగనే చెప్పాలి. అయితే కాంగ్రెస్‌ను జనాలు ఆద‌రిస్తారనే నమ్మకంలేదు.

ఎందుకంటే అడ్డుగోలుగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందనే మంట జనాల్లో ఇంకా అలాగే ఉంది. అందుకనే రెండు ఎన్నికల్లో అభ్యర్థులకు జనాలు డిపాజిట్లు ఇవ్వటానికి కూడా ఇష్టపడలేదు. అలాంటిది మూడో ఎన్నికలో మాత్రం బ్రహ్మరథం పడతారా..? అందులోనూ షర్మిల కారణంగా. గ్రౌండ్ రియాలిటీ వదిలేసి జగన్‌కు వ్యతిరేకంగా తాము ఎవరిని ప్రమోట్ చేయదలచుకుంటే వాళ్ళని ప్రమోట్ చేయటమే ఎల్లోమీడియా టార్గెట్ అని అందరికీ తెలుసు. నిజంగానే కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే కొద్దిరోజులు షర్మిలను ముందుపెట్టి జాతరలో పోతురాజులా గోలచేసే ఎల్లోమీడియా ఎన్నికల తర్వాత ఏమిచేస్తుందో చూడాలి.

First Published:  30 Dec 2023 5:33 AM GMT
Next Story