Telugu Global
Andhra Pradesh

బ్యాంకులో వేస్తామ‌న్నా భ‌య‌మేనా.. చంద్ర‌బాబు పెన్ష‌న్లు అలాగే ఇచ్చార‌ని మ‌ర్చిపోయారా?

ఏటీఎంకి 10, 20 కి.మీ. మించి దూరం ఉన్న ఊళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వేళ్ల‌మీద లెక్క‌పెట్టొచ్చు. అలాంట‌ప్పుడు వెళ్లి రావ‌డానికి 3, 4 వందలు ఎందుకు ఖ‌ర్చ‌వుతాయి?

బ్యాంకులో వేస్తామ‌న్నా భ‌య‌మేనా.. చంద్ర‌బాబు పెన్ష‌న్లు అలాగే ఇచ్చార‌ని మ‌ర్చిపోయారా?
X

ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌తో ఏపీలో పెన్ష‌న్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉన్న నేప‌థ్యంలో గ‌త నెల పెన్ష‌న్ల పంపిణీ పెద్ద ప్ర‌హ‌స‌నంగా మారింది. ఈసారి పెన్ష‌న్లు ఇళ్ల ద‌గ్గ‌రే ఇవ్వాల‌న్న టీడీపీ డిమాండ్‌తో ఈసీ త‌ద‌నుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. గ‌త నెల‌లో పింఛ‌నుదారులు ప‌డిన ఇబ్బందుల‌ను చూసిన ప్ర‌భుత్వం బ్యాంకు అకౌంట్లున్న పెన్ష‌న్‌దారుల‌కు అకౌంట్‌లో వేసేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇది కూడా త‌ప్ప‌న్న‌ట్లు.. ఏదో మోసం చేసేస్తున్న‌ట్లు టీడీపీ, ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తోంది. జ‌గ‌న్ వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తెచ్చాక పెన్షన్లు ఇంటి ముంగిట‌కు వ‌చ్చి ఇస్తున్నారు. కానీ టీడీపీ హ‌యాంలో ఐదేళ్లూ బ్యాంకు అకౌంట్‌లో వేసిన విష‌యం చంద్ర‌బాబు, ఆయ‌న అనుకూల మీడియా మ‌ర్చిపోయిన‌ట్లున్నారు పాపం.

ఇంటికొచ్చి ఇచ్చేవాళ్ల‌ను చెడ‌గొట్టి ఇప్పుడు దొంగ ఏడుపులా?

ఒక‌టో తేదీ తెల్ల‌వార‌క‌ముందే త‌లుపు కొట్టి పెన్ష‌న్లు ఇచ్చిన వాలంటీర్ల‌ను టీడీపీ ఏడుపులు, పెడ‌బొబ్బ‌ల‌తో ఈసీ ప‌క్క‌న‌పెట్టింది. ప్ర‌త్యామ్నాయంగా వృద్ధులు, మంచానికే ప‌రిమిత‌మైన వాళ్ల‌కు ఇంటికెళ్లి ఇచ్చినా అత్య‌ధిక మంది స‌చివాలయాల చుట్టూ మండుటెండ‌లో తిర‌గాల్సి వ‌చ్చింది. ఈక్ర‌మంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అది త‌మ పాప‌మే అని తెలిసినా టీడీపీ నేత‌లు దాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు ఈసారి ఇళ్ల ద‌గ్గ‌రే ఇవ్వాల‌ని గోల మొద‌లుపెట్టారు. ఈసీ ఆదేశాల‌తో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బ్యాంకు ఖాతాలున్న వారికి పెన్ష‌న్లు అందులోనే జ‌మ చేస్తామ‌ని, లేనివారిలో వృద్ధులు, మంచానికే ప‌రిమిత‌మైన వారికి ఇళ్ల‌కు వెళ్లి అంద‌జేస్తామ‌ని చెప్పింది. దీనిపైనా టీడీపీ, ఎల్లోమీడియా రాద్ధాంతం చేస్తోంది.

బ్యాంకు అకౌంట్లో జ‌మ చేస్తే నేర‌మా?

బ్యాంకు అకౌంట్లో పెన్ష‌న్ వేస్తే వృద్ధుల‌కు ఎండ‌లో వెళ్లి తెచ్చుకోవడం క‌ష్టం.. ఏటీఎంలు ఎక్క‌డో ఉంటాయి.. ఎవ‌ర్న‌న్నా తోడు తీసుకెళ్లి తెచ్చుకోవాలంటే 3, 4 వంద‌లు వెళ్లి రావ‌డానికే అయిపోతాయ‌ట‌. 2,3 బ్యాంకు ఖాతాలున్న‌వారికి ఏ బ్యాంకులో పెన్ష‌న్ ప‌డిందో తెలియ‌దు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకింగ్ సేవా కేంద్రాల్లో తీసుకోవాలంటే వృద్ధుల వేలిముద్ర‌లు ప‌డ‌వు.. ఇవీ టీడీపీ ఆరోప‌ణ‌లు.. ఎల్లో మీడియా విశ్లేష‌ణ‌లు.

ఇదీ వాస్తవం

ఏటీఎంకి 10, 20 కి.మీ. మించి దూరం ఉన్న ఊళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వేళ్ల‌మీద లెక్క‌పెట్టొచ్చు. అలాంట‌ప్పుడు వెళ్లి రావ‌డానికి 3, 4 వందలు ఎందుకు ఖ‌ర్చ‌వుతాయి? పోస్టాఫీస్‌ల్లో కూడా ఆధార్ నంబ‌ర్‌, వేలిముద్ర ద్వారా డ‌బ్బులు డ్రా చేసుకోవ‌చ్చు. వాలంటీర్ల దగ్గ‌రున్న డివైజ్‌ల‌లో వేలిముద్ర వేశాకే పెన్ష‌న్ ఇస్తున్నారు. అందులో ప‌డిన వేలిముద్ర బ్యాంక్ సేవాకేంద్రాలు, పోస్టాఫీసులు, పోస్ట్ మేన్ల దగ్గ‌రున్న డివైజ్‌ల‌లో ప‌డ‌దా? అని అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.

అయినా నిజంగా ఈ ఇబ్బందులుంటే టీడీపీ హ‌యాంలో పెన్ష‌న‌ర్లు చాలా అవ‌స్థ‌లు ప‌డిన‌ట్లే క‌దా.. అవ‌న్నీ జ‌గ‌న్ పాల‌న‌లో పోయిన‌ట్లే క‌దా.. ఈ విశ్లేష‌ణ‌ల‌తో జ‌గ‌న్ పాల‌నే పెన్ష‌న‌ర్ల‌కు బాగుంద‌ని మ‌న‌మే హింట్ ఇస్తున్నామ‌న్న విష‌యాన్ని టీడీపీ, వారి అనుకూల మీడియా ఒప్పుకుంటున్న‌ట్లే క‌దా!

First Published:  29 April 2024 6:19 AM GMT
Next Story