Telugu Global
Andhra Pradesh

ఫేక్ జీవో ప్రచార వివాదంలో ఈటీవీ.. తిరిగి ప్రభుత్వంపై ఎదురుదాడి

దీనిపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇచ్చింది. అదో ఫేక్ జీవో అని.. అలాంటి ఆలోచనే లేదని, ఉద్యోగులెవరూ నమ్మవద్దని చెప్పింది. ఇలాంటి ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో అనేకం వస్తుంటాయి. కానీ, ఈసారి ఈటీవీ కూడా పప్పులో కాలేసిందని చెబుతున్నారు.

ఫేక్ జీవో ప్రచార వివాదంలో ఈటీవీ.. తిరిగి ప్రభుత్వంపై ఎదురుదాడి
X

పొలిటికల్ స్టాండ్ ఎలా ఉన్నా.. ఈనాడు మీడియా సంస్థ ఫేక్‌ వార్తలను ప్రచారం చేయదన్న ఒక అభిప్రాయం ఉండేది. అలాంటి ఈటీవీ కూడా ఒక ఫేక్ వార్తను ప్రసారం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించడంతో ఇలా జరగడానికి కారణం ప్రభుత్వమే అంటూ ఈనాడు పత్రిక పెద్ద కథనాన్ని అచ్చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును జగన్‌ ప్రభుత్వం 62 నుంచి 65ఏళ్లకు పెంచిందంటూ ఒక ఫేక్ జీవోను సోషల్ మీడియాలోకి కొందరు వదిలారు. దాన్ని ఆధారంగా చేసుకుని బ్రేకింగ్‌ వార్తగా హడావుడి చేశారు.

ఈటీవీ కూడా అదే పని చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈటీవీలో వార్త వచ్చిందని ఉద్యోగులు కంగారు పడటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. తీరా ఆరా తీస్తే అది ఎవరో సృష్టించిన ఫేక్ జీవో అని తేలింది. ఈ జీవోను తొలుత టీడీపీ సోషల్ మీడియా ప్రచారంలోకి తెచ్చినట్టు భావిస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62ఏళ్లకు పెంచారు. కేవలం రిటైర్ అయ్యే ఉద్యోగులకు భారీగా డబ్బు చెల్లించాల్సి ఉండటంతో .. దాన్ని దాటవేసేందుకే ఆ పెంపు చేశారని.. ఇప్పుడు మరోసారి అదే పని జగన్ చేశారంటూ టీడీపీ సోషల్ మీడియా ప్రచారానికి దిగింది.

దీనిపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇచ్చింది. అదో ఫేక్ జీవో అని.. అలాంటి ఆలోచనే లేదని, ఉద్యోగులెవరూ నమ్మవద్దని చెప్పింది. ఇలాంటి ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో అనేకం వస్తుంటాయి. కానీ, ఈసారి ఈటీవీ కూడా పప్పులో కాలేసిందని చెబుతున్నారు.

సోషల్ మీడియాలో కొందరు సృష్టించిన నకిలీ జీవోను.. ఏమాత్రం నిర్ధారించుకోకుండా, ఇంగితం లేకుండా ఈటీవీ ప్రచారం చేయడం ఏమిటని వైసీపీ పత్రిక విరుచుకుపడింది. ఉద్యోగులను రెచ్చగొట్టేందుకే ఈటీవీ ఈ పనిచేసిందని ఆరోపించింది. ఈ వివాదం నేపథ్యంలో ఈనాడు పత్రిక తొలి పేజీలోనే ఒక పెద్ద కథనాన్ని అచ్చేసింది. అసలు ఉద్యోగుల రిటైర్ మెంట్ వయసు పెంపున‌కు సంబంధించిన నకిలీ జీవోపై ఇంత రాద్దాంతం జరగడానికి జగన్ ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించింది. గత ప్రభుత్వాల హయాంలో ప్రతి జీవోనూ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచేవారని దాంతో నకిలీ జీవోలను గుర్తించటం సులువుగా ఉండేదని వివరించింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక జీవోఐఆర్‌ను ఎత్తివేసిందని.. జారీ చేస్తున్న జీవోల్లో కొన్నింటిని మాత్రమే ఏపీ గెజిట్‌ సైట్‌లో ఉంచుతున్నారని ఈనాడు విమర్శించింది. అత్యధికంగా జీవోలను రహస్యంగా ఉంచుతుండటం వల్లనే ఈ గందరగోళం తలెత్తిందని ఈనాడు వాదిస్తోంది. గతంలోనూ ఏపీ గెజిట్‌లో ఉంచని కొన్ని జీవోలు ఆ తర్వాత బయటకు వచ్చాయని.. ఈ జీవో కూడా అదే తరహాలో రహస్యంగా ఉంచిన ఒరిజినల్ జీవోనే అయి ఉంటుందని భావించారని ఈనాడు చెబుతోంది.

First Published:  29 Jan 2023 5:20 AM GMT
Next Story