Telugu Global
Andhra Pradesh

మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి.. 4 గ్రామాల ప్రజల ఆవేదన..

ఏపీనుంచి సకాలంలో సాయం అందని పరిస్థితుల్లో వారు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సహకారంతో భద్రాద్రి జిల్లా యంత్రాంగం రెండు లాంచీలను ఆయా గ్రామాలకు పంపింది

మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి.. 4 గ్రామాల ప్రజల ఆవేదన..
X

గోదావరి వరదల తర్వాత ఏపీ, తెలంగాణ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. గతంలో తెలంగాణ నుంచి ఏపీలో కలిపేసిన మండలాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేయాలని అక్కడి నేతలు డిమాండ్ చేశారు. మాకు హైదరాబద్, భద్రాచలం ఇచ్చేయండి అంటూ ఇక్కడి నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. ఈ వాదనలు ఎలా ఉన్నా.. అసలు ముంపు గ్రామాల ప్రజలు ఏమనుకుంటున్నారనేదే అసలు ప్రశ్న. గోదావరి వరదలకు తీవ్రంగా నష్టపోయిన ఎటపాక మండల ప్రజలు తమని తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలోని భద్రాచలం మండలంలో ఎటపాక ఒక గ్రామం. ముంపు మండలాలను ఏపీలో విలీనం చేసిన తర్వాత ఎటపాక మండల కేంద్రం అయింది దాని పరిధిలో పిచ్చుకలపాడు, ఎటపాక, పురుషోత్తమ పట్నం, గుండాల, కన్నాయిగూడ గ్రామాలున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఈ మండలం ఏపీలో జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి వచ్చింది. ఆ జిల్లా కేంద్రం పాడేరు. పాడేరు నుంచి ఎటపాక మండలానికి ఉన్న దూరం 380 కిలోమీటర్లు. వరదల సమయంలో జిల్లా అధికారులు సకాలంలో స్పందించాలన్నా, జిల్లా కేంద్రం నుంచి సహాయం అందాలన్నా గగనం అయిపోయింది.

ఏపీనుంచి సకాలంలో సాయం అందని పరిస్థితుల్లో వారు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సహకారంతో భద్రాద్రి జిల్లా యంత్రాంగం రెండు లాంచీలను ఆయా గ్రామాలకు పంపింది. 150మందిని ముంపు బారినుంచి కాపాడింది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అధికారులు ఎమ్మెల్యే సహకారంతో తామంతా ప్రాణాలతో బయటపడ్డామని చెబుతున్నారు గ్రామస్తులు. పురుషోత్తం పట్నం ప్రజలు మినహా మిగిలిన 4 గ్రామాల ప్రజలు తిరిగి తమను తెలంగాణలో కలపాలంటున్నారు. తమకు ప్యాకేజీ ఇచ్చి పంపించేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

గుండాల గ్రామం భద్రాచలానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ అది ఏపీలో అంతర్భాగం. గోదావరికి కొద్దిగా వరద వచ్చినా ఈ గ్రామం చుట్టూ నీళ్లు చేరుకుంటాయి. ప్రస్తుతం గోదావరి వరద తగ్గుముఖం పట్టినా ఇంకా గ్రామంలోకి వెళ్లడానికి ప్రజలకి ధైర్యం చాలటం లేదు. గ్రామంలో వందలాది పశువులు చనిపోయాయి. ప్రస్తుతం వారంతా తెలంగాణ ప్రాంతంలో వరద సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే ఈ గ్రామంలో భయాందోళనలు మొదలవుతాయి. ఈ గ్రామం చుట్టూ వరదనీరు చేరుకుంటుంది. గతంలో కూతవేటు దూరంలో ఉన్న భద్రాచలం నుంచి వెంటనే అధికారులు వచ్చి తమను రక్షించేవారని, ఇప్పుడు 380 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రం ఉండటంతో అధికార యంత్రాంగాన్ని సంప్రదించాలన్నా సాధ్యం కావడం లేదంటున్నారు.

First Published:  21 July 2022 6:12 AM GMT
Next Story