Telugu Global
Andhra Pradesh

కాపీలతోనే నెట్టుకొచ్చేస్తారా..?

బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో అని లోకేష్ ప్రకటించారు. దీన్ని తెలంగాణ కాంగ్రెస్ డిక్లరేషన్ల నుంచి కాపీకొట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టిందే.

కాపీలతోనే నెట్టుకొచ్చేస్తారా..?
X

తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మొత్తం కాపీగానే కనిపిస్తోంది. తాజాగా లోకేష్ మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించబోతున్నట్లు చెప్పారు. జనవరి 4వ తేదీ నుంచి జయహో బీసీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ ఇప్పటికి రిలీజ్ చేసిన మినీ మేనిఫెస్టో కానీ, కార్యక్రమాలు కానీ, ఏదో పార్టీనుండి కాపీకొట్టినవే అని తెలిసిపోతోంది. తల్లికి వందనం, మహిళా శక్తి లాంటి పథకాలు వైసీపీ నుంచి కాపీకొట్టినవే. ఇక ఏడాదికి మూడుగ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టినవి.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. మూడు గ్యాస్ సిలిండర్ల హామీని 2014 ఎన్నికల్లో కూడా ఇచ్చిందే. అప్పుడు ఉచిత గ్యాస్ అంటూ ఊదరగొట్టారే కానీ, అమలుచేయలేదు. రైతు రుణమాఫీ అని ఆర్భాటంగా ప్రకటించి అరకొర చేసి వదిలిపెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు రైతులకు ఏడాదికి 20 వేల రూపాయలని హామీఇచ్చారు. 2014లో కూడా ఇంటికో ఉద్యోగమని లేకపోతే నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. రెండూ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలని లేకపోతే నిరుద్యోగ భృతంటున్నారు.

బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో అని లోకేష్ ప్రకటించారు. దీన్ని తెలంగాణ కాంగ్రెస్ డిక్లరేషన్ల నుంచి కాపీకొట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టిందే. చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో లేదా ప్రకటిస్తున్న హామీలను గమనిస్తే ఏదో పార్టీ నుంచి కాపీ కొట్టినట్లు అర్థ‌మైపోతోంది. అయితే తాను మాత్రం ఎంతో మేథోమథనం చేసి పథకాలపై కసరత్తులు చేసి రూపకల్పన చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పైగా తన పథకాలనే జగన్మోహన్ రెడ్డి కాపీ కొడుతున్నట్లు బురదచల్లేస్తున్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని జగన్ కాపీకొట్టి జనవరి నుంచి అమలు చేయబోతున్నట్లు చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. అసలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని జగన్ ఎక్కడా ప్రకటించలేదు. ఎల్లోమీడియా కథనం ఇచ్చింది దాన్ని పట్టుకుని చంద్రబాబు ఆరోపణలతో బురదచల్లేస్తున్నారు. సొంతంగా ఆలోచించే శక్తిని చంద్రబాబు కోల్పోయిన విషయం అర్థ‌మవుతోంది. ఇంకా ఎంతకాలం ఇలా కాపీలతో నెట్టుకొచ్చేస్తారో చూడాలి.

First Published:  30 Dec 2023 5:57 AM GMT
Next Story