Telugu Global
Andhra Pradesh

పవన్‌ ‘ఉస్తాద్‌’ ట్రైల‌ర్‌పై ఈసీ కన్ను

స్పందించిన ఎన్నికల కమిషన్‌.. గాజు గ్లాసు చూపించి పబ్లిసిటీ చేస్తే రాజకీయ ప్రచారం కిందకే వస్తుందని తేల్చిచెప్పడం గమనార్హం. అయితే ఇప్పటివరకు తాము ఆ వీడియోని చూడలేదని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.

పవన్‌ ‘ఉస్తాద్‌’ ట్రైల‌ర్‌పై ఈసీ కన్ను
X

పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమాకు సంబంధించి ఆ సినిమా యూనిట్‌ తాజాగా హడావుడిగా విడుదల చేసిన ట్రైల‌ర్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమా ప్రచారం ముసుగులో ఎన్నికల ప్రచారం చేశారని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఈ ట్రైల‌ర్‌లో పవన్‌ పార్టీ సింబల్‌ గాజు గ్లాస్‌ చుట్టూనే విషయం అంతా నడిపారు. అంతేకాదు.. గాజు గ్లాసుపై పవన్‌తో డైలాగులు కూడా చెప్పించారు. అందుకే సార్వత్రిక ఎన్నికలు కోడ్‌ అమలులో ఉన్న వేళ ఈ వీడియో కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

తాజాగా ఈ వీడియో వ్యవహారం ఎన్నికల కమిషన్‌ దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్‌.. గాజు గ్లాసు చూపించి పబ్లిసిటీ చేస్తే రాజకీయ ప్రచారం కిందకే వస్తుందని తేల్చిచెప్పడం గమనార్హం. అయితే ఇప్పటివరకు తాము ఆ వీడియోని చూడలేదని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ఏ మాధ్యమం ద్వారా అయినా రాజకీయ ప్రచారం చేసుకోవచ్చని.. కానీ, దానికి ఓ పద్ధతి ఉంటుందని, ముందుగా పర్మిషన్‌ తీసుకోవాలని ఈ సందర్భంగా ఈసీ తెలిపింది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైల‌ర్‌ను ఇంకా చూడలేదని, చూసిన తర్వాత రాజకీయ ప్రచారం అని భావిస్తే, కచ్చితంగా నిర్మాతలకు నోటీసులిస్తామని వెల్లడించింది.

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ వీడియోపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఒకవేళ ఈ రెండు రోజుల్లో ఫిర్యాదు రాకపోయినా స్వచ్ఛందంగా తాము వీడియో చూసి అందులో నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. వీడియోలో చూపించిన సన్నివేశాలు, డైలాగులు ఎన్నికల ప్రచారం కిందకు వస్తే తప్పకుండా నిర్మాతలకు నోటీసులిస్తామని ప్రకటించింది. టేబుల్, సైకిల్, ఫ్యాన్, గ్లాసు లాంటివి మనం రెగ్యులర్‌ గా వాడుతుంటామని.. అలా అని వాటిని ప్రతిసారి పబ్లిసిటీ కింద చూడకూడదని తెలిపిన ఎన్నికల సంఘం.. ఏ అంశాన్నయినా కేస్‌–టు–కేస్‌ పరిశీలిస్తామని తెలిపింది. అన్నింటినీ ఒకే గాటన కట్టిపడేయబోమని తేల్చిచెప్పింది.

First Published:  21 March 2024 5:23 AM GMT
Next Story