Telugu Global
Andhra Pradesh

పాఠకులకు క్షమాపణ చెప్పిన ఈనాడు

సాంకేతిక కారణాలవల్ల పొరపాటు జరిగిందని ఈనాడు వివరణ ఇచ్చింది. తప్పును గుర్తించి ఆ ఫొటోలను డిజిటల్ ఎడిషన్ నుంచి కూడా తొలగించామని ప్రకటించింది.

పాఠకులకు క్షమాపణ చెప్పిన ఈనాడు
X

ఈనాడు పత్రిక పప్పులో కాలేసి పరువు పోగొట్టుకుంది. ఇదే అదునుగా ఈనాడు పత్రిక పై సాక్షి పత్రిక బ్యానర్ ఐటమ్ తో విరుచుకుపడింది. గన్నవరంలో జరిగిన విధ్వంసం నేపథ్యంలో టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన పోలీసులు తనను పలు స్టేషన్లకు తిప్పుతూ ఒక స్టేషన్‌లో అరగంట పాటు దారుణంగా చిత్రహింసలు పెట్టారంటూ పట్టాభి ఆరోపించారు.

ముఖానికి టవల్ కట్టి లాఠీ ఛార్జ్ చేశారని వివరించారు. తన చేతికి గాయాలైన దృశ్యాలను ఆయన మీడియాకు చూపుతో కోర్టులోనికి వెళ్లారు. ఈ అంశంపై ఈనాడు పత్రిక బుధవారం ప్రధానంగా కథనాన్ని ప్రచురించింది. పట్టాభినీ కొట్టారు అంటూ నాలుగు ఫొటోలను కూడా ప్రచురించింది.

పట్టాభిని పోలీసులు కొట్టిన దెబ్బలకు గాయాలు ఇవిగో అంటూ ఫొటోలను అచ్చేసింది. ఇక్కడే ఈనాడు పత్రిక దొరికిపోయింది. ఈనాడు పత్రిక తొలి పేజీలోనే బ్యానర్ గా ప్రచురించిన కథనంలో వాడిన ఫొటోలు అసలు ఇప్పటివే కాదని ఆ తర్వాత తేలింది. 2021లో పట్టాభికి సంబంధించిన ఫొటోలను ఈనాడు పత్రిక మంగళవారం జరిగిన ఘటనకు సంబంధించినవిగా ప్రచురించి పాఠకుల్ని తప్పుదోవ పట్టించింది. దీంతో ఈ వ్యవహారం పెద్ద వివాదంగా మారింది.

ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు రాస్తోంది అనడానికి ఇదే నిదర్శనం అంటూ అధికార పార్టీ విరుచుకుపడింది. పక్కాగా దొరికిపోవడంతో ఈనాడు పత్రిక కూడా క్షమాపణ చెప్పక తప్పలేదు. జరిగిన పొరపాటుకు క్షమాపణ చెబుతూ ఈనాడు పత్రిక సవరణ ప్రచురించింది. బుధవారం ఈనాడు పత్రికలో ప్రచురితమైన ఫొటో విష‌యంలో తప్పు జరిగిందని అంగీకరించింది.

దెబ్బలు కొట్టినట్టు పట్టాభి తన చేతిని చూపిస్తున్న ఒక ఫొటో మాత్రమే మంగళవారానికి సంబంధించినదని వివరించింది. ఆయన కాళ్లపై కొట్టినట్టుగా వచ్చిన ఫొటోలు మాత్రం 2021 నాటివని, సాంకేతిక కారణాలవల్ల పొరపాటు జరిగిందని ఈనాడు వివరణ ఇచ్చింది. తప్పును గుర్తించి ఆ ఫొటోలను డిజిటల్ ఎడిషన్ నుంచి కూడా తొలగించామని ప్రకటించింది. ఈనాడు పత్రిక చేసిన పొరపాటును గురువారం సాక్షి పత్రిక తన బ్యానర్ ఐటెంగా ప్రచురించి ఈనాడు, రామోజీపై విరుచుకుపడింది.

First Published:  23 Feb 2023 3:00 AM GMT
Next Story