Telugu Global
Andhra Pradesh

చంద్ర‌బాబు త‌ప్పిదాలు కప్పిపుచ్చడానికి ఇత‌రుల‌పై బుర‌ద‌జ‌ల్లుతున్న ఈనాడు

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి స్కూట‌ర్ల మీద ట‌న్నుల కొద్దీ ఇనుము స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు లెక్క‌లు రాసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌ అవినీతిని ప్ర‌శ్నించ‌ని ఎల్లోమీడియాకు చిన్న లోపాలు మాత్రం భూత‌ద్దంలో క‌నిపిస్తాయి.

చంద్ర‌బాబు త‌ప్పిదాలు కప్పిపుచ్చడానికి ఇత‌రుల‌పై బుర‌ద‌జ‌ల్లుతున్న ఈనాడు
X

మోడీ చెప్పిన‌ట్టు చంద్రబాబు తన పాలనాకాలంలో ఏటీఎంలా మార్చుకున్న పోలవరం ప్రాజెక్టు ప‌నుల‌ను సీఎం జగన్మోహన్ రెడ్డి పరుగులు పెట్టించి కీలకమైన ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేస్తే ఆక్రెడిట్ అంతా జగన్ కే వెళ్ళిపోతుందనే అక్కసుతో ఎల్లోమీడియా, పచ్చ తమ్ముళ్లు దుమ్మెత్తిపోసే పనిలో బిజీగా ఉన్నారు.

గత ప్రభుత్వం హయాంలో పబ్లిసిటీ కోసం జనాలను బస్సుల్లో తరలించి జయము జయము చంద్రన్న అంటూ భజనలు చేయించుకుని ప్రాజెక్టు పూర్తి చేయకుండా కాలయాపన చేశారు చంద్ర‌బాబు. ప్రస్తుతం పోలవరం పనులు చివరి దశకు చేరుకున్న తరుణంలో ప్రాజెక్టు పై దుష్ప్రచారం మొదలెట్టారు పచ్చనేతలు.


పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి స్కూట‌ర్ల మీద ట‌న్నుల కొద్దీ ఇనుము స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు లెక్క‌లు రాసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌ అవినీతిని ప్ర‌శ్నించ‌ని ఎల్లోమీడియాకు చిన్న లోపాలు మాత్రం భూత‌ద్దంలో క‌నిపిస్తాయి.


నాడు చంద్రబాబు అనాలోచితంగా నాన్ ఇంజినీరింగ్ పద్దతిలో పోలవరం ప్రాజెక్టు పనులు చేయడం వల్ల వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లడంతో పాటు విలువైన సమయం కూడా వృథా అయింది. దీంతో పాటు ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాజెక్టులో కీలకమైన రాక్ ఫిల్ డ్యాం నిర్మించాలంటే ముందుగా స్పిల్ వే, స్పిల్ ఛానెల్, అప్రోచ్ ఛానెల్ పనులు పూర్తి చేయడంతో పాటు సమాంతరంగా నదికి అడ్డుకట్ట వేసే ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణాలు పూర్తి చేయాలి. కానీ దీనికి విరుద్ధంగా ఏ పనులు చేస్తే త్వరగా డబ్బులు వస్తాయో అని తెలుసుకుని, తానే పెద్ద ఇంజినీరుగా అవతారం ఎత్తి, ఇరిగేషన్ అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తూ ఇంజినీరింగ్ పద్దతికి విరుద్దంగా మిగతా పనులను వదిలేసి, కీలకమైన డివాల్ నిర్మాణం 2017 డిసెంబర్-1న మొదలు పెట్టి, 2018 జూన్-9న పూర్తి చేశారు చంద్రబాబు. దాదాపు 414 రోజులలో దేశంలోనే అతిపెద్దదైన డివాల్ నిర్మించాం అంటూ భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నారే గానీ ముందు చూపు లేకుండా చేసిన పని వల్ల ఇప్పుడు దాదాపు వేల కోట్ల నష్టం భరించాల్సి వస్తోంది.

అసలు డివాల్ అంటే ఏంటి..?

పోలవరం ప్రాజెక్టు లో అతి ముఖ్యమైనది ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం. ఈ డ్యాం నిర్మించాక ఒక్క చుక్క నీరు కూడా ఎగువ నుండి దిగువకు వెళ్ళకుండా ఉండాలి. దీని కోసం ముందుగా నది మధ్యలో 93.5మీ గరిష్ట లోతు నుండి 1.4 కి.మీ పొడవున ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యాం నిర్మించాలి. ఇలా నిర్మించాక దాని పై బండరాళ్ళు, మట్టి, ఇసుకతో రాక్ ఫిల్ డ్యాం నిర్మిస్తారు. దీనిని దాదాపు 53మీటర్ల ఎత్తున నిర్మిస్తారు.

ఐతే చంద్రబాబు ప్రభుత్వ హాయాంలో దీనిని ఆగమేఘాల మీద నిర్మించేసి దీనికి రక్షణగా ఉండాల్సిన ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణాలు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు.

ఎగువ కాఫర్ డ్యాంకు కుడివైపున ఎడమ వైపున ఉంచిన గ్యాప్ ల వల్ల 2018, 2019, 2020లో వచ్చిన భారీ వరదల వల్ల అసంపూర్తిగా వదిలేసిన ఎగువ కాఫర్ డ్యాం వల్ల ఎగువన ఉన్న గ్రామాలను వ‌ర‌ద‌లు ముంచెత్తడంతో పాటు తీవ్రమైన పంట, ఆస్తి నష్టం జ‌రిగాయి.

2020లో వచ్చిన దాదాపు 22లక్షల క్యూసెక్కుల భారీ వరద ప్రవాహానికి డివాల్ భారీగా దెబ్బతింది. దీంతో పాటు గ్యాప్-1 అప్రోచ్ ఏరియా కూడా భారీ ఎత్తున కోతకు గురవ్వడంతో పాటు, స్పిల్ వే, స్పిల్ ఛానెల్, అప్రోచ్ ఛానెల్ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడి ప్రాజెక్టు నిర్మాణంలో విలువైన సమయం వృథా అవ్వడంతో పాటు వరద నీరు తోడడానికి అదనపు ఖర్చు కూడా అయ్యింది.

జగన్ ప్రభుత్వం ఈ పనులన్నింటినీ ఇంజినీరింగ్ స‌ల‌హా ప్ర‌కార‌మే పూర్తి చూసుకుంటూ, కీలకమైన ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణ పనులు చేస్తూ సమాంతరంగా స్పిల్ వే, నిర్మాణ పనులు పూర్తి చేసి, అప్రోచ్ ఛానెల్ మీదుగా స్పిల్ ఛానెల్ నుండి గోదావరి నదీ ప్రవాహాన్ని దాదాపు 6.6 కి.మీ మళ్ళింపు పనులు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.

ఐతే భారీ వరదల వల్ల దెబ్బతిన్న డివాల్ ను డీడీఆర్పీ సభ్యులు పలుమార్లు పరిశీలించిన తరువాత నిపుణులతో చర్చించి దెబ్బతిన్న చోట్ల డివాల్ కు సమాంతరంగా 'యు' ఆకారంలో డివాల్ నిర్మించాలని సూచించడం జరిగింది. దీనికి ప్రాథ‌మికంగా 2వేల కోట్ల రూపాయ‌లు అద‌నంగా ఖర్చవుతుందని అంచనా కూడా వేయడం జరిగింది. ఈ అద‌న‌పు ఖ‌ర్చు చంద్ర‌బాబు చేసిన త‌ప్పిదాల ఫ‌లితం.

గత మూడు నాలుగు సంవత్సరాలుగా వచ్చిన భారీ వరదలకు ముఖ్యంగా డయాఫ్రం వాల్, అప్పర్ కాఫర్ డ్యాంలతో పాటు మట్టి కట్టలు కోతకు గురయ్యాయి. వీటిని అప్పటి ప్రభుత్వం ఇంజినీరింగ్ నియమాలకు విరుద్ధంగా చేయడం వల్ల కూడా ఆ నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా జలాశయం తట్టుకొని స్పిల్ వే మీదుగా వరద సులభంగా పారేందుకు నిర్మాణ పనుల్లో, డిజైన్లలో తరచూ కేంద్ర జలసంఘం మార్పులు చేస్తోంది. ఈ మార్పుల ఆధారంగా నిపుణులు సూచనల మేరకు వారి పర్యవేక్షణ‌లోనే అప్రోచ్ ఛానెల్ లో స్పిల్ వే కు ఎడమ వైపున 500మీటర్ల పొడవున దాదాపు 52మీటర్ల ఎత్తున బండ రాళ్ళతో గైడ్ బండ్ నిర్మించడం జరిగింది.

ఐతే ఇటీవల గైడ్ బండ్ నదివైపున కొంతమేర కుంగడంతో దీనిపై వెంటనే జలవనరుల శాఖ అధికారులు, పీపీఏ, నిపుణుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దీనిపై పరిశీలన చేసి ఏం చేయాలనేదానిపై త్వరలోనే నిపుణుల కమిటీ ఒక అంచనాకు రానుంది. ఈలోగానే చంద్రబాబు అండ్ పచ్చమీడియా పోలవరం ప్రాజెక్టు లో కీలకమైన గైడ్ బండ్ కుంగిపోయింది, కోట్లలో నష్టం అంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. పూర్తిగా నిపుణుల సూచనల మేరకే ఎప్పటికప్పుడు వారి పర్యవేక్షణలోనే నిర్మించిన గైడ్ బండ్ కుంగడంతో ఇప్పటికే నిపుణులు దీనిపై పరిశీలన చేస్తున్నారు.

ఐతే చంద్రబాబు మరియు ఎల్లో మీడియా గతంలో తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఎదుర‌వుతున్న చిన్న స‌మ‌స్య‌ల‌ను కూడా భూతద్దంలో చూపెడుతూ పెద్ద సమస్యగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే గతంలో చేసిన అన్ని తప్పిదాలనూ సరిచేసుకుంటూ నిపుణుల సూచనలతో పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటూ ప్రాజెక్టు ఫలాలను ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తుంటే.. పచ్చనేతలు, ఎల్లో మీడియా మాత్రం తమ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ పోతుందో అని విషంగక్కుతున్నారు.

First Published:  10 Jun 2023 11:24 AM GMT
Next Story