Telugu Global
Andhra Pradesh

ఈడీ దాడులతో కదులుతున్న ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి గుట్టు

టీడీపీ నేత అలపాటి రాజా కుటుంబ నియంత్రణలో ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి పాల‌క‌మండలి ఉంది. ఈ నిధుల దారి మళ్లింపులో ఆయన కుటుంబసభ్యుల పాత్రపైనా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఈడీ దాడులతో కదులుతున్న ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి గుట్టు
X

గుంటూరు జిల్లా చినకాకానిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ పెద్దలకు సంబంధించిన ఆస్పత్రిగా పేరున్న ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రితో పాటు డైరెక్టర్ల నివాసాలపైనా ఈడీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలకమైన ఆధారాలు లభ్యమైనట్టు చెబుతున్నారు.

ఆస్పత్రి నిధులను సొంత ఖాతాలకు దారి మళ్లించినట్టు గుర్తించారు. ఈ నిధులతోనే ఈనాడు రామోజీరావుకు దగ్గరి బంధువు, ఎన్‌ఆర్ఐ ఆస్పత్రి కోశాధికారి అక్కినేని మణి సొంతంగా ఒక ఆస్పత్రిని నిర్మించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఆమె నిర్మించిన అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నిధులు దారి మళ్లించడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్టు భావిస్తున్నారు. అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన బిల్లులనూ ఎన్‌ఆర్‌ఐ నుంచే చెల్లించడాన్ని ఈడీ గుర్తించింది.

టీడీపీ నేత అలపాటి రాజా కుటుంబ నియంత్రణలో ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి పాల‌క‌మండలి ఉంది. ఈ నిధుల దారి మళ్లింపులో ఆయన కుటుంబసభ్యుల పాత్రపైనా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆస్పత్రి నిధులు సొంత ఖాతాలకు మళ్లింపు వెనుక సుజనాచౌదరి సన్నిహితుడి పేరు కూడా వినిపిస్తోంది.

మేనేజ్‌మెంట్‌ కోటాలో మెడికల్ సీట్ల భర్తీలోనూ భారీగా నిధులు చేతులు మారినట్టు ఈడీ అనుమానిస్తోంది. నిబంధనలకు విరుద్దంగా భారీగా ఫీజులు వసూలు చేసి సొంత ఖాతాలకు మళ్లించినట్టు చెబుతున్నారు. కొవిడ్‌ సమయంలో భారీగా ఫీజులు వసూలు చేసి ఆ సొమ్మును కూడా సొంత ఖాతాలకు మళ్లించేసుకున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. కొవిడ్ సమయంలో వైద్యం అందుకున్న వేలాది మంది పేషెంట్ల డేటాపైనా ఈడీ దృష్టి సారించింది.

కొవిడ్ చికిత్స తీసుకున్న 1500 మంది వివరాలను రికార్డుల్లో నమోదు చేయని అంశాన్ని ఈడీ గుర్తించినట్టు సమాచారం. ఆ 1500 మంది నుంచి వసూలు చేసిన ఫీజును నేరుగా డైరెక్టర్లు తమ ఖాతాలకు మళ్లించేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. కొవిడ్ నిధుల విషయంలో అక్కినేని మణిపైనా ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె ఆస్పత్రిలోని 9 మంది మహిళా వైద్యులతో కలిసి బయటకు వచ్చి సొంతంగా ఆస్పత్రి నిర్మించారు. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలోని డైరెక్టర్లు రెండుగా చీలిపోయి వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఉదంతం ఉంది. ఒక దశలో ఆస్పత్రిని అమ్మాలని ఒక వర్గం డిమాండ్ చేయగా.. మరో వర్గం అడ్డుపడింది.

First Published:  3 Dec 2022 2:41 AM GMT
Next Story