Telugu Global
Andhra Pradesh

ఏపీ సీఎస్‌, డీజీపీలపై ఈసీ సీరియస్‌.. ఢిల్లీకి రావాలని పిలుపు

ఏపీలో పోలింగ్ రోజు రాత్రి, మరుసటి రోజు చాలా ప్రాంతాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పలుచోట్ల కార్లకు నిప్పు పెట్టారు.

ఏపీ సీఎస్‌, డీజీపీలపై ఈసీ సీరియస్‌.. ఢిల్లీకి రావాలని పిలుపు
X

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్‌ కుమార్ గుప్తాలపై ఈసీ సీరియస్‌ అయింది. ఈనెల 13న ఏపీలో పోలింగ్ ముగియగా.. తర్వాతి రోజు పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. పల్నాడులోని మాచర్ల, నరసరావుపేటతో పాటు తాడిపత్రి, చంద్రగిరి, ఆళ్లగడ్డలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు పరస్పరం దాడులకు దిగాయి.

దీంతో చీఫ్‌సెక్రటరీ, డీజీపీలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేవలం రివ్యూలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంది. సీఎస్‌ జవహర్ రెడ్డితో పాటు డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఇద్దరు అధికారులను ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని కోరింది ఈసీ.




ఇటీవల టీడీపీ నేతల ఫిర్యాదుతో డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని బదిలీ చేసిన ఈసీ.. ఆయన స్థానంలో హరీష్ కుమార్‌ గుప్తాకు బాధ్యతలు అప్పగించింది. ఇక ఏపీలో పోలింగ్ రోజు రాత్రి, మరుసటి రోజు చాలా ప్రాంతాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పలుచోట్ల కార్లకు నిప్పు పెట్టారు. ఈ హింసలో వందల మందికి గాయాలయ్యాయి. ఇరువైపులా నష్టం జరిగింది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో 144 సెక్షన్ విధించారు. ఇక తాడిపత్రిలోనూ 144 సెక్షన్ విధించి జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దిరెడ్డిలను వేర్వేరు ప్రాంతాలకు అధికారులు తరలించారు.

First Published:  15 May 2024 11:52 AM GMT
Next Story