Telugu Global
Andhra Pradesh

ముగ్గురికి ఈ రెండు జిల్లాలే కీలకమా..?

ఈ రెండుజిల్లాలపైనే ఎందుకు దృష్టిపెట్టారంటే ఈ జిల్లాల్లో మెజారిటి సీట్లు సాధించిన పార్టీయే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంటు బలంగా నాటుకుపోయింది కాబట్టే.

ముగ్గురికి ఈ రెండు జిల్లాలే కీలకమా..?
X

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని మూడు పార్టీల అధినేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోటీకి రెడీ అయ్యారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ వ్యవహారమే తేలలేదు. పొత్తుల విషయంలో ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరిస్తుండటంతో మామూలు జనాలతో పాటు రెండు పార్టీల నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. సరే పొత్తుల విషయాన్ని పక్కన పెట్టేస్తే ముగ్గురికి రెండు జిల్లాలు చాలా కీలకంగా మారబోతున్నాయి.

ఇంతకీ ఆ జిల్లాలు ఏవంటే ఉభయగోదావరి జిల్లాలు. తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే పశ్చిమగోదావరి జిల్లాలో 15 ఉన్నాయి. ఈ రెండుజిల్లాలపైనే ఎందుకు దృష్టిపెట్టారంటే ఈ జిల్లాల్లో మెజారిటి సీట్లు సాధించిన పార్టీయే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంటు బలంగా నాటుకుపోయింది కాబట్టే. చరిత్రను చూస్తే ఈ విషయం నిజమే అని ఒప్పుకోవాల్సిందే. అందుకనే ఈ జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించాలని ముగ్గురూ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

అనాదిగా ఉన్న సెంటిమెంటుకు తోడు ఒక్కసారిగా రాజకీయ వేడి కూడా రాజుకుంది. కారణం ఏమిటంటే పవన్ ది పశ్చిమగోదావరి జిల్లా అవటంతో పాటు కాపు సామాజికవర్గం కావటమే. ఈ రెండుజిల్లాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువే. కాపు సామాజికవర్గమే అయినా పోయిన ఎన్నికల్లో పవన్ ఘోరంగా దెబ్బతిన్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రెండుజిల్లాల్లో మెజారిటి సీట్లు సాధించి జగన్ను దెబ్బతీయాలని బలంగా కోరుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పశ్చిమగోదావరి జిల్లాను క్లీన్ స్వీప్ చేసేసింది. అలాగే తూర్పులో టీడీపీ 12 సీట్లు, 1 బీజేపీ మరోటి ఇండిపెండెంట్ గెలవగా వైసీపీ 5 సీట్లలో గెలిచింది.

ఇక 2019లో పశ్చిమలో వైసీపీ 12 స్ధానాల్లో గెలవగా టీడీపీ 3 చోట్ల గెలిచింది. అలాగే తూర్పులో వైసీపీ 14 సీట్లు, టీడీపీ 4, జనసేన ఒక చోట గెలిచింది. చివరి రెండు ఎన్నికల్లో ఓటింగ్ సరళిని చూసిన తర్వాత టీడీపీ, జనసేన కలిస్తే స్వీప్ ఖాయమనే ప్రచారం పెరుగుతోంది. ఇదే సమయంలో రెండు పార్టీలు కలిస్తే రెండూ నష్టపోతాయనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. పొత్తుల విషయాన్ని పక్కనపెట్టేస్తే మూడు పార్టీలు జనాల్లో పట్టుసాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

First Published:  25 Dec 2022 5:25 AM GMT
Next Story