Telugu Global
Andhra Pradesh

నన్ను బూతులు తిట్టారు, స్పీకర్ ని కొట్టబోయారు..

స్పీకర్ తమ్మినేని సీతారాంపై చేయి వేశారని, స్పీకర్‌ ను కాపాడటానికే వైసీపీ ఎమ్మెల్యేలు ఎలిజా, సుధాకర్ బాబు పోడియం దగ్గరకు వెళ్లారని చెప్పారు.

నన్ను బూతులు తిట్టారు, స్పీకర్ ని కొట్టబోయారు..
X

ఏపీ అసెంబ్లీలో ఘర్షణ జరిగిన అనంతరం టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఎస్సీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేశారని చంద్రబాబు ఆరోపించారు. కాదు కాదు బీసీ స్పీకర్ పైకి ఎస్సీ ఎమ్మెల్యేని ఉసిగొల్పి రాజకీయం చేయాలని చూశారంటూ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అంటున్నారు. తనని కూడా టీడీపీ నేతలు బెదిరించారని రారా అంటూ దుర్భాషలాడారని, నాకొ-- అంటూ బూతులు మాట్లాడారని ఆరోపించారు.

స్పీకర్ పై దాడికి ప్రయత్నించారు..

జీవో నెంబర్-1 రద్దుకోసం వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ చర్చకు పట్టుబట్టింది. టీడీపీ ఎమ్మెల్యేలంతా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్లకార్డులు ప్రదర్శించి పేపర్లు చించి విసిరేశారు. ఈ క్రమంలో స్పీకర్ పై ఎమ్మెల్యేలు దాడికి ప్రయత్నించారని అంటున్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, ఎలిజా ని.. టీడీపీ ఎమ్మెల్యేలు తోసివేశారని, కిందపడేశారని చెప్పారు. స్పీకర్ తమ్మినేని సీతారాంపై చేయి వేశారని, స్పీకర్‌ ను కాపాడటానికే వైసీపీ ఎమ్మెల్యేలు ఎలిజా, సుధాకర్ బాబు పోడియం దగ్గరకు వెళ్లారని చెప్పారు.

అట్రాసిటీ కేసు పెడతా..

తనను దూషించడమే కాకుండా బూతులు తిట్టారని వాపోయారు నారాయణ స్వామి. బాల వీరాంజనేయులు, బుచ్చయ్య చౌదరి సహా మరో ఇద్దరు నేతలు తనని తిట్టారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యలపై అట్రాసిటీ కేసు పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలన స్పీకర్ కి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విజ్ఞప్తి చేశారు. మొత్తమ్మీద అసెంబ్లీలో జరిగిన రచ్చ కులం రంగు పులుముకుంది. ఎస్సీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. తనని దూషించిన టీడీపీ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని వైసీపీ నేత నారాయణ స్వామి అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ఒకరోజు సమావేశాలనుంచి సస్పెండ్ చేయడంతో ప్రస్తుతానికి ఈ గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది.

First Published:  20 March 2023 6:33 AM GMT
Next Story