Telugu Global
Andhra Pradesh

దసరానే ముహూర్తం.. విశాఖపట్నం నుంచే పాలన : ఏపీ సీఎం వైఎస్ జగన్

విశాఖలో కార్యాలయాల ఎంపిక కోసం కమిటీని నియమించాలని ఆదేశించారు. సదరు కమిటీ సూచనల మేరకే కార్యాలయాల ఏర్పాటు ఉంటుందని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

దసరానే ముహూర్తం.. విశాఖపట్నం నుంచే పాలన : ఏపీ సీఎం వైఎస్ జగన్
X

దసరా నుంచి విశాఖపట్నం నుంచే పరిపాలన ప్రారంభించనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయదశమి నుంచే విశాఖ నుంచి పాలన ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలను అప్పటి లోగా వైజాగ్‌కు తరలించాలని కేబినెట్ నిర్ణయించింది.

విశాఖలో కార్యాలయాల ఎంపిక కోసం కమిటీని నియమించాలని ఆదేశించారు. సదరు కమిటీ సూచనల మేరకే కార్యాలయాల ఏర్పాటు ఉంటుందని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు జగన్ సూచించారు. సార్వత్రిక, అసెంబ్లీ, జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారమే ముందుకు వెళ్దామని మంత్రులకు చెప్పినట్లు తెలుస్తున్నది.

ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగి రిటైర్డ్ అయ్యే సమయానికి ఇంటి స్థలం లేని వారికి కచ్చితంగా స్థలం ఉండేలా చర్యల తీసుకోవాలని.. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని సీఎం జగన్ చెప్పారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలకు కూడా ఆరోగ్యశ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల పిల్లల చదవులు కూడా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కింద ప్రయోజనాలు అందేలా చూడాలని చెప్పారు.

జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటు యూనివర్సిటీల చట్టంలో సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రఖ్యాత యూనివర్సిటీలతో సంయుక్త సర్టిఫికేషన్ ఉండేలా చట్ట సవరణ చేయనున్నారు. ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్ సర్టిఫికేషన్, ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

కురుపం ఇంజనీరింగ్ కాలేజీలో 50 శాతం సీట్లు గిరిజనులకే కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం. పోలవరం ముంపు బాధితులకు 8,424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణకు, పీవోటీ చట్ట సవరణకు ఆమోదం లభించింది. భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకి కూడా ఆమోదం లభించింది. దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.


First Published:  20 Sep 2023 10:30 AM GMT
Next Story