Telugu Global
Andhra Pradesh

శున‌కాల ర‌క్త‌దానం

తాజాగా విశాఖపట్నంలో శున‌కాలు రక్తదానం చేశాయి. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెంపుడు కుక్కల రక్తాన్ని వాటి యజమానులు ఆపదలో ఉన్న శునకాల కోసం దానం చేయించారు.

శున‌కాల ర‌క్త‌దానం
X

మనుషులు రక్తదానం చేయడం చూశాం. మరి జంతువులు కూడా రక్తదానం చేస్తాయి తెలుసా? అయినా అవి ర‌క్త‌దానం చేయ‌డం ఎందుకు అంటారా? మ‌నుషుల‌కు అవ‌స‌ర‌మైన‌ట్టే వాటికీ ఏదైనా శ‌స్త్రచికిత్స‌లు అవ‌స‌ర‌మైన‌ప్పుడు ర‌క్తం అవ‌స‌ర‌మ‌వుతుంది.

మనుషుల్లో లాగే జంతువులకు కూడా బ్లడ్ గ్రూపులుంటాయి. మనుషుల్లో ఏ పాజిటివ్, ఏబీ పాజిటివ్, ఓ పాజిటివ్, ఏ నెగిటివ్, ఓ నెగిటివ్.. ఇలా 35 రకాల వరకు బ్లడ్ గ్రూపులున్నాయి. కుక్కల్లో 13 వరకు బ్లడ్ గ్రూప్స్ ఉండగా.. గుర్రాల్లో 8, పిల్లుల్లో 3 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. కుక్కల్లో 1.1, 1.2, 3, 4, 5 ఇలా ఒక్కో జాతి శునకాన్ని బట్టి నెంబర్ల రూపంలో కుక్కల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. రక్తం ప్రవహించే ప్రతీ జంతువులోనూ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. జంతువులకు సంబంధించి రక్తదాన ప్రక్రియకు దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది. జంతువుల నుంచి రక్తం సేకరించేటప్పుడు వాటికి మత్తు మందు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనుషుల రక్తదాన సేకరణకు బ్లడ్ బ్యాంకులు ఎలా ఉన్నాయో.. జంతువుల రక్తదాన సేకరణకు కూడా బ్ల‌డ్ బ్యాంకులు ఉన్నాయి. వాటి నిర్వాహకులు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంటారు. మరి జంతువుల నుంచి ఎంత రక్తం సేకరిస్తారంటారా? అది జంతువులు, వాటి పరిమాణం ఆధారంగా ఉంటుంది. కుక్కల నుంచి అయితే 450 మిల్లీ లీట‌ర్లు, పిల్లుల నుంచి అయితే 53 మిల్లీ లీట‌ర్లు ర‌క్తాన్ని సేక‌రిస్తారు.

ఇప్పుడు ఈ జంతువుల రక్తదానం చర్చ ఎందుకొచ్చిందంటే.. తాజాగా విశాఖపట్నంలో శున‌కాలు రక్తదానం చేశాయి. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెంపుడు కుక్కల రక్తాన్ని వాటి యజమానులు ఆపదలో ఉన్న శునకాల కోసం దానం చేయించారు. పెద్ద వాల్తేరులోని `పావ్స్ ఎన్ టైల్స్` సంస్థ ఆగస్టు 28వ తేదీన‌ ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ఈ శిబిరంలో మొత్తం 10 మంది శున‌కాల య‌జ‌మానులు ముందుకొచ్చి ర‌క్త‌దానం చేయించారు. కుక్కల నుంచి సేకరించిన రక్తాన్ని నిల్వ చేసి ఏవైనా గాయాల కారణంగా.. ప్రాణపాయ స్థితిలో ఉన్న శునకాలకు అవసరమైనప్పుడు ఉపయోగిస్తామని పశు వైద్య నిపుణులు చెబుతున్నారు.

First Published:  29 Aug 2022 9:06 AM GMT
Next Story