Telugu Global
Andhra Pradesh

దొంగఓట్లకు ఎల్లోమీడియా మద్దతా..?

ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఓట్లను మాత్రమే వైసీపీ దొంగఓట్లుగా చెప్పి తీయించేస్తోందని టీడీపీ నేతలు ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ కొందరు ఓటర్లకు నోటీసులిస్తోంది.

దొంగఓట్లకు ఎల్లోమీడియా మద్దతా..?
X

ఏపీలో దొంగ ఓట్లపై రాజ‌కీయం రోజురోజుకు ముదురుతోంది. అధికార‌, విప‌క్ష పార్టీలు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఎన్నిక‌ల్లో దొంగ ఓట్లు వేయించుకోవాలంటే అందుకు ముందు అలాంటి ఓట్లను చేర్పించాలి. స్థానిక‌త‌తో సంబంధంలేకుండా ఎక్క‌డెక్క‌డి వారినో తెచ్చి వాళ్ళకి ఓటరు కార్డులు ఇప్పిస్తారు. ఎన్నికల సమయంలో వాళ్ళని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్ళి తమకే ఓట్లేసేట్లుగా జాగ్రత్తలు తీసుకుంటారు. పోలింగ్ అయిపోయిన తర్వాత ఓట్లేసిన వాళ్ళు మాయమైపోయి మళ్ళీ ఎన్నికల సమయానికి ప్రత్యక్షమవుతారు.

ఇలాంటి వ్యవహారాల్లో రాజ‌కీయ పార్టీల‌న్నీ ఆరితేరిపోయాయి. ఇప్పుడు సమస్య ఏమిటంటే.. వైసీపీ, టీడీపీలు దొంగఓట్ల విషయంలో ఒకదానిపై మరోపార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. దొంగఓట్లని తాము అనుమానించిన జాబితాలను కమిషన్‌కు అందిస్తున్నాయి. మంత్రులు, వైసీపీ నేతలు చెప్పేదేమంటే టీడీపీ నమోదు చేయించిన దొంగఓట్లను తాము గుర్తించి తీయించాలని కమిషన్ కు ఫిర్యాదులు చేస్తున్నామని.

ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఓట్లను మాత్రమే వైసీపీ దొంగఓట్లుగా చెప్పి తీయించేస్తోందని టీడీపీ నేతలు ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ కొందరు ఓటర్లకు నోటీసులిస్తోంది. డబుల్, త్రిబుల్ ఓట్లున్నాయి కాబట్టి ఏ ఓటు నిజమైనదో చెప్పమని అడుగుతోంది. దానిపై ఎల్లోమీడియా వ్యతిరేకంగా వార్తలు మొదలుపెట్టింది. నోటీసులు ఇచ్చి ఓటర్లను కమిషన్ ఇబ్బందులకు గురిచేస్తోందట. ఓటర్ల మెడపై నోటీసుల కత్తి పేరుతో పెద్ద స్టోరీ అచ్చేసింది. ఓటర్లకు నోటీసులు ఇవ్వటం తప్పెలాగవుతుందో ఎల్లోమీడియానే చెప్పాలి.

తాము ఎక్కడ నివాసం ఉంటున్నారో ఓటర్లు చెప్పుకుని, తమకు ఎక్కడ ఓటు కావాలో ఎన్నికల కమిషన్‌కు చెబితే సరిపోతుంది. నిజంగానే కమిషన్ చెప్పినట్లుగా డబుల్, త్రిబుల్ ఓట్లుంటే ఏరేయటంలో తప్పేమీలేదు. ఇందులో నిజ‌మైన‌ ఓటర్లకు నష్టంకూడా లేదు. అయినా దాన్ని పెద్ద నేరంగా ఎల్లోమీడియా చిత్రీకరిస్తోంది. ఇదే విషయమై మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఓట్లున్న వారిని ఏపీలో ఓట్లేయించుకునేందుకు అనుమతించకూడదన్నారు. హైదరాబాద్‌తో పాటు ఏపీలో కూడా ఉన్న 4.3 లక్షల ఓట్లను గుర్తించి కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణ, ఏపీలో డబుల్ ఓట్లున్న వాళ్ళు సుమారు 16 లక్షలట. డబుల్, త్రిబుల్ ఓట్లను ఏరేస్తుంటే ఎల్లోమీడియా ఎందుకు గోలచేస్తోందో అర్థంకావటంలేదు.

First Published:  7 Dec 2023 4:34 AM GMT
Next Story