Telugu Global
Andhra Pradesh

విశ్వసనీయత రామోజీకి మాత్రమేనా..ఇంకెవరికీ ఉండదా..?

మార్గదర్శి చిట్ పేరుతో రామోజీరావు ప్రభుత్వంతో పాటు లక్షలాదిమంది ఖాతాదారులను మోసం చేస్తున్నారనేది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలు.

విశ్వసనీయత రామోజీకి మాత్రమేనా..ఇంకెవరికీ ఉండదా..?
X

కళంకం, కుట్ర, విశ్వసనీయత లాంటి పదాలను అల్లేసి రామోజీరావు సొంతపేపర్ లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. ఇంతపెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవటానికి కారణం ఏమిటంటే రామోజీగ్రూపు సంస్ధల్లో ఎంతో కీలకమైన మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేటు లిమిటెడ్ విశ్వసనీయతపై దారుణమైన దెబ్బపడటమే. ఎప్పుడూ తనకు పడని వారిపై బురదచల్లేస్తు వారి విశ్వసనీయతను దారుణంగా దెబ్బతీయటమే తెలిసిన రామోజీకి ఇప్పుడు తన విశ్వసనీయతను నిరూపించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.

మార్గదర్శి చిట్ పేరుతో రామోజీరావు ప్రభుత్వంతో పాటు లక్షలాదిమంది ఖాతాదారులను మోసం చేస్తున్నారనేది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలు. మార్గదర్శికి వ్యతిరేకంగా ఉండవల్లి పెద్ద న్యాయపోరాటమే చేస్తున్నారు. ఆ పోరాటం ఫలితంగానే ఇప్పుడు రామోజీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. రామోజీ గ్రూపులోని ఏ సంస్ధలో తనిఖీలు చేయటానికి కూడా ఏ ప్రభుత్వమూ సాహసంచేయలేదు. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా మూడురోజుల పాటు విస్తృతంగా తనిఖీలు చేసింది.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రామకృష్ణ నేతృత్వంలో తనిఖీలు జరగటమే కాకుండా అవినీతి జరిగిందని, నిధులు పెద్దఎత్తున దారిమళ్ళిందని, అవకతవకలు జరిగాయని ప్రకటించారు. ఆ ప్రకటనతోనే తన విశ్వసనీయత దెబ్బతిన్నదని రామోజీ తెగ ఫీలైపోయారు. అసలు రిజర్వుబ్యాంకు చట్టం ప్రకారం రామోజీ చిట్ ఫండ్ వ్యాపారమే చేయకూడదని ఉండవల్లి అంటుంటే దానికి ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. మార్గదర్శిలో ఎక్కడెక్కడ మోసాలు జరుగుతున్నాయో ఉండవల్లి కొన్నివందలసార్లు చెప్పుంటారు. అప్పుడెప్పుడూ స్పందించని రామోజీ ఇప్పుడు మాత్రమే ఎందుకు స్పందించారు..?

ఎందుకంటే తన విశ్వసనీయత దారుణంగా పడిపోయిందని అర్థ‌మైంది కాబట్టే. విశ్వసనీయత అనేది తనకు మాత్రమే ఉంటుందని రామోజీ చాలా బలంగా నమ్ముతున్నారు. ప్రభుత్వానికి కూడా విశ్వసనీయత ఉంటుందని రామోజీకి ఎప్పుడూ అనిపించలేదు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని పొరబాటున కూడా చెప్పటంలేదు. ఎంతసేపు నెగిటివ్ కథనాలే కాకుండా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు జనాలకు భ్రమలు కల్పిస్తు విపరీతంగా బురదచల్లేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నారనేదాంతో సంబంధంలేకుండా ప్రభుత్వానికి కూడా విశ్వసనీయత ఉంటందని రామోజీ అనుకునుంటే ఇప్పుడీ సమస్యలు, సమర్ధనలు వచ్చేవే కావు. ప్రభుత్వ ఆరోపణలపై ఇంతపెద్ద సమర్ధన ఇచ్చుకున్నారంటేనే మార్గదర్శిలొని డొల్లతనం బయటపడిందనర్థం.

First Published:  4 Dec 2022 4:31 AM GMT
Next Story