Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు రాయలసీమ బిడ్డేనా..?

రాయలసీమ వాసిగా కన్నా చంద్రబాబు కోస్తా జిల్లా వాసిగా చెప్పుకోవటానికే ఇష్టపడతారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. అందుకనే రాయలసీమను ఎండగట్టి మరీ పట్టిసీమ లాంటి ప్రాజెక్టును నిర్మించారు.

చంద్రబాబు రాయలసీమ బిడ్డేనా..?
X

‘నేను రాయలసీమ బిడ్డను.. నాలో ఉండేది రాయలసీమ రక్తమే అందుకనే రాయలసీమలోని ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించేందుకు రాత్రి, పగలు కష్టపడ్డాను’ ఇది తాజాగా చంద్రబాబునాయుడు పీలేరు బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలు. తాను రాయలసీమ బిడ్డనే అని, తనలో ఉన్నది రాయలసీమ రక్తమే అని చంద్రబాబు చెప్పుకోవటంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. తనది రాయలసీమని, తనలో రాయలసీమ రక్తముందని మొదటిసారి చెప్పుకున్నారు. ఈ మాటలు విన్న వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే ఇలాంటి మాటలను చంద్రబాబు గతంలో ఎప్పుడు చెప్పుకోలేదు.

తాను రాయలసీమ వాసిగా చెప్పుకోవటానికి కూడా చంద్రబాబు ఇష్టపడరు. పైగా సందర్భం వచ్చినా, కల్పించుకునైనా రాయలసీమను పదేపదే అవమానించిన సందర్భాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిపైన బురదచల్లిన ప్రతిసారి రాయలసీమ ఫ్యాక్షనిస్టని, రాయలసీమ గూండాలని, పులివెందుల రౌడీలని ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. జగన్ను విలన్ గా చూపటం కోసం మొత్తం రాయలసీమను చంద్రబాబు చాలాసార్లు అవమనించారు. రాయలసీమకు కాదు కదా చివరకు తాను పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లాకు కూడా చంద్రబాబు చేసిందేమీలేదు.

రాయలసీమ వాసిగా కన్నా చంద్రబాబు కోస్తా జిల్లా వాసిగా చెప్పుకోవటానికే ఇష్టపడతారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. అందుకనే రాయలసీమను ఎండగట్టి మరీ పట్టిసీమ లాంటి ప్రాజెక్టును నిర్మించారు. రాయలసీమలో జరుగుతున్న తాగు, సాగునీటి ప్రాజెక్టులు తెలుగుగంగ, గాలేరు-నగిరి, హంద్రీ-నీవా పనులు ఎన్టీఆర్ పుణ్యమే కానీ, చంద్రబాబు చేసిందేమీలేదు. పైగా ఈ ప్రాజెక్టులకు సరిగా నిధులు విడుదల చేయకుండా దెబ్బకొట్టారు. దివంగత వైఎస్సార్ హయాంలోనే కొన్ని పనులు జరిగాయి.

పద్మావతి మహిళా మెడికల్ కాలేజీ అడ్మిషన్లలో రాయలసీమ కోటాను ఎత్తేశారు. దాంతో సీమలోని విద్యార్థినులు రాష్ట్రం మొత్తంలోని విద్యార్థినులతో అడ్మిషన్లలో పోటీపడాల్సొచ్చింది. కొందరు విద్యార్థినులు కోర్టుకెళ్ళటంతో విద్యార్థినులకే అనుకూలంగా తీర్పొచ్చింది. అయితే దాన్ని చంద్రబాబు అమలుచేయకుండా సుప్రీం కోర్టులో రివైజ్డ్ పిటీషన్ వేశారు. అలాగే విభజన చట్టంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఏపీకి ఎయిమ్స్ ను కేటాయించింది. దాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటుచేస్తున్నట్లు చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. తర్వాత దాన్ని గుంటూరుకు తరలించేశారు. తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్ ను కేంద్రం మంజూరు చేస్తే దాన్ని కోస్తా జిల్లాలకు తరలించేశారు. చెప్పుకుంటూ పోతే రాయలసీమకు చంద్రబాబు చేసిన ద్రోహం చాలానే ఉంది.

ఈ నేపథ్యంలోనే పోయిన గ‌త ఎన్నికల్లో సీమలోని 52 నియోజకవర్గాల్లో వైసీపీ 49 చోట్ల గెలిచింది. రాబోయే ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి రిపీటైతే అధికారంలోకి రాలేమని చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. అందుకనే సడెన్ గా తాను రాయలసీమ బిడ్డనని, తనలో ఉన్నది రాయలసీమ రక్తమే అని కబుర్లు చెప్పారు. రాయలసీమ వాసిగా ఉంటూ ఈ ప్రాంతానికి ద్రోహం చేశారని తనపైన ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయో చంద్రబాబు సమాధానం చెప్పగలరా..?

First Published:  28 Jan 2024 5:25 AM GMT
Next Story