Telugu Global
Andhra Pradesh

టీడీపీలో కలవరం పెరిగిపోతోందా ?

వచ్చే ఎన్నికల్లో కూడా బీసీలు వైసీపీకి ఎక్కడ మద్దతుగా నిలబడతారో అనే భయమే చంద్రబాబు అండ్ కోలో కనబడుతోంది. అందుకనే జగన్‌ను బీసీల ద్రోహి అంటూ గోల చేస్తోంది.

టీడీపీలో కలవరం పెరిగిపోతోందా ?
X

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు నుండి కింద స్ధాయి నేతల వరకు ఒక్కసారిగా కలవరం పెరిగిపోతున్నట్లే ఉంది. దానికి కారణం వైసీపీ నిర్వహించిన బీసీ నేతల ఆత్మీయ సమ్మేళనమే. తమ పార్టీలోని బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానం, పార్టీవైపు బీసీ సామాజికవర్గాలను ఆకర్షించటానికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

జగన్ ఆదేశాలకు అనుగుణంగానే ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇప్పుడు వైసీపీ నిర్వహించిన అంతర్గత సమావేశం లాంటివాటిని టీడీపీ కూడా చాలా సార్లే నిర్వహించుకున్నది. సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు ఏ రాజకీయ పార్టీ అయినా చేసేదిదే. ఇంతోటిదానికి ఇప్పుడు చంద్రబాబు అండ్ కో జగన్‌పై రెచ్చిపోతున్నారు. నారా లోకేష్, యనమల రామకృష్షుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న, బోండా ఉమ, పంచుమర్తి అనూరాధ ఒక్కసారిగా గోల మొదలుపెట్టారు.

బీసీలను మోసం చేసిన పార్టీ వైసీపీ అని రెచ్చిపోయారు. టీడీపీనే మొదటి నుండి బీసీల పార్టీగా ఉందని చెప్పారు. బీసీలకు అన్యాయం చేసిన ద్రోహి అని జగన్‌పై మండిపడ్డారు. వీళ్ళు రెచ్చిపోయిన విధానం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా బీసీలు వైసీపీనే ఆదరిస్తారేమో అనే ఆందోళనే ఎక్కువగా కనబడుతోంది. బీసీలకు చేసింది తామే అంటే కాదు తామే అని అన్నీ పార్టీలు చెప్పుకోవటం సహజం. కానీ తమకు న్యాయం చేసిందెవరనే విషయంలో బీసీలు ఎలా ఫీలవుతున్నారన్నదే ముఖ్యం. తమకు ఏ పార్టీ వల్ల లాభం జరిగిందని బీసీలు నమ్ముతారో కచ్చితంగా ఆ పార్టీకే ఓట్లేస్తారనటంలో సందేహం లేదు.

2019 ఎన్నికల్లో బీసీల్లో అత్యధికులు వైసీపీకి ఓట్లేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ తీసుకున్న నిర్ణయాల కారణంగా బీసీల్లో అత్యధికులు జగన్‌పై నమ్మకంతో వైసీపీకి ఓట్లేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీసీలకే పెద్దపీట వేస్తున్నారు. టీడీపీ ఇప్పుడు గోలచేస్తోందంటే కచ్చితంగా ఆందోళనతోనే అని అర్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా బీసీలు వైసీపీకి ఎక్కడ మద్దతుగా నిలబడతారో అనే భయమే చంద్రబాబు అండ్ కోలో కనబడుతోంది. అందుకనే జగన్‌ను బీసీల ద్రోహి అంటూ గోల చేస్తోంది.

ఒక‌ప్పుడు బీసీలు టీడీపీకి మద్దతుగా నిలబడింది వాస్తవమే. మొన్నటి ఎన్నికల్లో వైసీపీని బలపరిచిందీ వాస్తవమే. దశాబ్దాలుగా తమకు మద్దతుగా ఉన్న బీసీలు టీడీపీని కాదని వైసీపీకి ఎందుకు మద్దతిచ్చారనే విషయాన్ని చంద్రబాబు నిజాయితీతో విశ్లేషించుకోవటం లేదు. మరి వచ్చే ఎన్నికల్లో బీసీ ఓట్లు ఎవరికి పడతాయో చూడాల్సిందే.

First Published:  27 Oct 2022 7:03 AM GMT
Next Story