Telugu Global
Andhra Pradesh

జగన్ సమర్పించు.. వర్మ రియల్ పిక్..

జగన్ ని కలసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు కాబట్టి, జగన్ ప్రత్యర్థుల్ని ఈ సినిమాతో టార్చర్ చేయబోతున్నారనేది మాత్రం అర్థమవుతోంది. రాజకీయ అరాచకాలు పుష్కలంగా ఉంటాయని వర్మ ఇచ్చిన స్టేట్ మెంట్ తో దీనిపై అప్పుడే అందరిలో ఆసక్తి మొదలైంది.

జగన్ సమర్పించు.. వర్మ రియల్ పిక్..
X

ఏపీ సీఎం జగన్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య భేటీ ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. పవన్ పై వారిద్దరూ సినిమా తీయబోతున్నారనే ప్రచారం జరిగింది. మరీ పవన్ పై సినిమా తీయడానికి జగన్ ఇలా వర్మను పిలుస్తారా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఆ అనుమానాలన్నిటినీ ఇప్పుడు వర్మ పటాపంచలు చేస్తూ సినిమా ప్రకటించారు. దాని పేరు వ్యూహం. రెండో పార్ట్ పేరు శపథం. ట్విట్టర్లో సినిమా ప్రకటన జరిగింది. ఎన్నికల టార్గెట్ గా ఈ సినిమా తియ్యట్లేదని చెబితే ఎవరూ నమ్మరు కాబట్టి ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం మీకు లేదని, ఈ విషయం మీకు వేరే చెప్పక్కర్లేదంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు వర్మ.

కావాల్సినంత మసాలా ఇచ్చారు వర్మ, ఇక రాసుకున్నాళ్లకి రాసుకున్నంత. పవన్ కల్యాణ్ పై సినిమా తీస్తారా, ఆయన మూడు పెళ్లిళ్లు హైలెట్ చేస్తారా..? అందులో చంద్రబాబు పాత్ర ఉంటుందా, జగన్ ని ఎలా చూపిస్తారు..? త్రివిక్రమ్ ఉంటారా..? పవన్ కల్యాణ్ తో పనిచేసిన హీరోయిన్ల ప్రస్తావన ఉంటుందా..? పవన్ తోపాటు చిరంజీవిని కూడా చూపిస్తారా..? ఆయన బామ్మర్ది అల్లు అరవింద్ ని కూడా ఇరికిస్తారా..? నాదెండ్ల పాత్ర ఏంటి..? ఇలా రకరకాలుగా ఈ సినిమా చుట్టూ అప్పుడే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ వ్యూహంలో ఏం చూపిస్తారు, ఆ తర్వాత శపథంతో ఎవరిపై కక్ష సాధిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

రాజకీయ నాయకులపై సెటైరికల్ సినిమాలు తీయడంలో వర్మ దిట్ట. ఆమధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరుతో చంద్రబాబుని చెడుగుడు ఆడుకున్నారు వర్మ, ఆ తర్వాత పవర్ స్టార్ అనే పేరుతో నేరుగానే పవన్ నే టార్గెట్ చేశారు. అమ్మ రాజ్యంలో కమ్మ బిడ్డలంటూ మరోటి కూడా తీయాలని ప్లాన్ చేశారు. బాల్ థాక్రే నుంచి వంగవీటి రంగా వరకు ఆయన టచ్ చేయని పొలిటికల్ సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు వ్యూహంతో ఆయన ఎవర్ని ఎలా టార్గెట్ చేశారనేది ఊహకందని విషయం. జగన్ ని కలసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు కాబట్టి, జగన్ ప్రత్యర్థుల్ని ఈ సినిమాతో టార్చర్ చేయబోతున్నారనేది మాత్రం అర్థమవుతోంది. రాజకీయ అరాచకాలు పుష్కలంగా ఉంటాయని వర్మ ఇచ్చిన స్టేట్ మెంట్ తో దీనిపై అప్పుడే ఆసక్తి మొదలైంది. ఇది బయోపిక్ కాదు, బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయంటూ మసాలా దట్టించే సరికి రాజకీయ వర్గాల్లో మరింతగా చర్చ జరుగుతోంది.

First Published:  27 Oct 2022 11:40 AM GMT
Next Story