Telugu Global
Andhra Pradesh

నెల్లూరు వైసీపీలో మళ్లీ మొదలైన లుకలుకలు

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో బాబాయ్-అబ్బాయ్ మధ్య విభేదాలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

నెల్లూరు వైసీపీలో మళ్లీ మొదలైన లుకలుకలు
X

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుపే లక్ష్యంగా అందరూ ఐక్యమత్యంగా పనిచేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ పిలుపునిచ్చారు. పార్టీ ప్లీనరీ నుంచి ఏ సమీక్ష జరిగినా ఇదే మాట పదే పదే చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. ప్రభుత్వ పనితీరు చూసి ప్రజలు ఓట్లేస్తారా లేదా అనేది పక్కన పెడితే.. వైసీపీ నాయకుల అంతర్గత పోరు మాత్రం పార్టీకి చేటు తెచ్చేలా ఉన్నది. నెల్లూరు జిల్లాలో గతంలో వర్గ పోరు పార్టీని ఇబ్బందులకు గురిచేసింది. అది కాస్త సద్దుమణిగింది అనుకునేలోపు ఇప్పుడు ఇంటి పోరు వైసీపీలో చిచ్చుపెట్టింది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో బాబాయ్-అబ్బాయ్ మధ్య విభేదాలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూప్‌కుమార్ యాదవ్‌లు వరుసకు అబ్బాయ్-బాబాయ్ అవుతారు. ఇద్దరూ వైసీపీ నుంచే పదవులు పొందారు. మొదట్లో ఒకరికి ఒకరుగా ఉన్న వీరిద్దరూ ఇటీవల కాలంలో ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా తీవ్రమైన విభేదాలు నెలకొన్నాయి. ఎమ్మెల్యే హోదాలో అనిల్ కుమార్ పాల్గొనే ఏ కార్యక్రమానికి కూడా డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ హాజరుకావడం లేదు. అంతే కాకుండా వైసీపీ సిటీ పార్టీ కార్యాలయానికి కూడా రూప్‌కుమార్ రావడం లేదు. ఇందుకు కచ్చితమైన కారణాలు ఏమిటో తెలియడం లేదు. కానీ, వీరిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా కార్యకర్తల్లో అయోమయం నెలకొన్నది.

అనిల్ కుమార్ రాజకీయాల్లో అరంగేట్రం చేయడంలో.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంలో బాబాయ్ రూప్‌కుమార్‌దే కీలక పాత్ర అనేది బహిరంగ రహస్యమే. నెల్లూరు జిల్లా రాజకీయాలపై మంచి అవగాహన, పట్టు ఉన్న రూప్‌కుమార్.. అనిల్ కుమార్ పొలిటికల్ కెరీర్‌ను తీర్చి దిద్దారు. మొదటి సారి పోటీ చేసిన ఓడిపోయినా.. గత రెండు పర్యాయాలు అనిల్ గెలుపులో రూప్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. అనిల్ రాజకీయ జీవితంలోని ఒడిదుడుకుల్లో రూప్‌కుమార్ తోడున్నారు. అనిల్ ఎన్నికల్లో నిలిచిన ప్రతీ సారి రూప్‌కుమార్ వెన్నంటి నడిచారు. నెల్లూరు సిటీ నుంచి అనిల్ రెండో సారి గెలవడంతో సీఎం వైఎస్ జగన్ ఆయనకు జలవనరుల శాఖా మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

మంత్రిగా అనిల్ రెండున్నర ఏళ్లు పని చేశారు. ఆ సమయంలో ఎక్కువగా అమరావతి లేదా ఇతర జిల్లాల పర్యటనలో ఉండేవారు. దీంతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్ బదులు అన్ని పనులు రూప్‌కుమార్ చక్కబెట్టేవారు. పార్టీ కార్యకర్తలు, అనుచరులు అందరినీ రూప్‌కుమార్ సమన్వయం చేసేవారు. అనిల్ లేని సమయంలో ప్రతిపక్షాలు పన్నే ఎత్తుగడలను రూప్‌కుమార్ తిప్పి కొడుతూ అబ్బాయ్‌కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవారు. అయితే రెండున్నర ఏళ్ల తర్వాత కేబినెట్ పునర్వవస్థీకరణలో భాగంగా అనిల్ కుమార్ మంత్రి పదవి కోలపోయారు. అప్పటి నుంచి నెల్లూరు సిటీ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు.

గతంలో రూప్‌కుమార్ యాదవ్ తన తరపున చేసిన పనులన్నీ అనిల్ స్వయంగా నిర్వహించుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఒకరికొకరు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అనిల్ దూరం పెట్టడంతో రూప్‌కుమార్ ఏకంగా సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. దానికి జగనన్న భవన్ అని పేరు పెట్టుకున్నారు. ఆ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిటీకి చెందిన వైసీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. అనిల్ అనుచరులు కూడా కొంత మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం.

గత కొంత కాలంగా అనిల్ ఎవరితోనూ సఖ్యతగా ఉండటం లేదు. రూరల్ ఎమ్మెల్యే, మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడితో సరైన సంబంధాలు లేవు. దీంతో రూప్‌కుమార్ తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. వైసీపీ నాయకులు, రూరల్ ఎమ్మెల్యే, మంత్రితో టచ్‌లో ఉంటూ సిటీ నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారు. ఇటీవల రూప్‌కుమార్ అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. దీని వెనుక అనిల్ ఉన్నట్లు రూప్‌కుమార్ ఆరోపిస్తున్నారు. ఇలా ఒకే ఇంటికి చెందిన వ్యక్తుల మధ్య విభేదాల కారణంగా పార్టీకి చెడ్డ పేరు వస్తోందని కొంత మంది సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. మరి నెల్లూరు సిటీ గొడవలపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

First Published:  27 Aug 2022 12:04 PM GMT
Next Story