Telugu Global
Andhra Pradesh

బెజవాడ టీడీపీలో మళ్లీ రచ్చ.. కమర్షియల్ నాయకులంటూ నాని సెటైర్లు..

2019లో తనకు ఎంపీగా మెజార్టీ ఇచ్చిన ఓటర్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికి కారణం అదేనన్నారు నాని. పరోక్షంగా దేవినేని ఉమ, బొండా ఉమపై కూడా ఆయన సెటైర్లు వేశారు.

బెజవాడ టీడీపీలో మళ్లీ రచ్చ.. కమర్షియల్ నాయకులంటూ నాని సెటైర్లు..
X

2019 వైసీపీ హవాలో టీడీపీ గెలుచుకున్న ఎంపీ సీట్లలో విజయవాడ ఒకటి. ఎంపీ అభ్యర్థి గెలిచారు కానీ, ఆ లోక్ సభ పరిధిలో టీడీపీకి భంగపాటు తప్పలేదు. విజయవాడ లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకే ఒక్కచోట టీడీపీ ఎమ్మెల్యే గెలిచారు. అందుకే అక్కడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని, ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థులకు అప్పుడప్పుడు చురకలంటిస్తుంటారు. ఇటీవల ఎంపీ నానికి, చంద్రబాబుకి మధ్య కూడా విభేదాలొచ్చాయని అన్నారు. నాని తమ్ముడిని చంద్రబాబు దగ్గరకు తీస్తున్నారని, అందుకే నాని టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, ఢిల్లీలో బీజేపీ నేతలతో టచ్ లో ఉంటున్నారని చెబుతున్నారు. అయితే నాని మాత్రం కాసేపు అలిగినా, ఆ తర్వాత సర్దుకుపోతుంటారు. తాజాగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో పర్యటించిన కేశినేని నాని సొంత పార్టీ నేతలపైనే సెటైర్లు వేశారు.

బెజవాడలో దేవినేని ఉమ వర్గం, కేశినేని నాని వర్గం మధ్య అంతర్గత విభేదాలున్నాయి. నాని కుమార్తెను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించే విషయంలో కూడా వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. అప్పట్లో చంద్రబాబు సర్దుబాటు చేశారు. ఆ తర్వాత దేవినేని ఉమపై నాని చాలా సందర్భాల్లో తన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా బెడవాడ‌ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని.. కమర్షియల్ నేతలను ప్రజలు అంగీకరించరని చెప్పారు. ఎక్కడో తొడలు కొట్టినంత మాత్రాన స్థానికంగా వారు గొప్ప నాయకులు కాలేరని చెప్పారు. అందరినీ భాగస్వామ్యం చేసి టీమ్ టీడీపీ పేరుతో కార్యక్రమాలు‌ చేస్తున్నామని, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు నాని.

నేను గెలిచా, వారు ఓడిపోయారు..

నాయకులెప్పుడూ ప్రజలనుంచి వస్తారని, మీడియా నుంచి కాదని చెప్పారు నాని. చంద్రబాబు సీఎం కావాలనే సంకల్పంతో కలసి మెలసి పని చేయాలన్నారు నాని. నాకు నేనే గొప్ప అని వెళితే ప్రజల్లో పరాభవం తప్పదని హితవు పలికారు. 2019లో తనకు ఎంపీగా మెజార్టీ ఇచ్చిన ఓటర్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికి కారణం అదేనన్నారు నాని. పరోక్షంగా దేవినేని ఉమ, బొండా ఉమపై కూడా ఆయన సెటైర్లు వేశారు.

బెజవాడలో ప్రస్తుతం నాని వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతున్న సమయంలో ఇలా సొంత పార్టీ నేతల్నే టార్గెట్ చేసి నాని మాట్లాడటం సరికాదంటున్నారు కొంతమంది నేతలు. నానిపై చంద్రబాబుకి ఫిర్యాదు చేస్తామంటున్నారు. అయితే నాని మాత్రం దూకుడు తగ్గించడంలేదు. కమర్షియల్ నేతలు, సోషల్ మీడియా నేతలు అంటూ.. సొంత పార్టీలో వైరి వర్గాన్ని టార్గెట్ చేశారు.

First Published:  28 Sep 2022 9:50 AM GMT
Next Story