Telugu Global
Andhra Pradesh

ఈ ఇద్దరి మధ్య‌ తేడా ఇదేనా ?

పార్టీ లైన్ దాటిన నేతల విషయంలో జగన్ కొంతవరకే ఉపేక్షిస్తున్నారు. ఇక లాభంలేదని అనుకోగానే ఎంతటి నేతలైనా కానీ వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం అలాంటి నేత‌ల‌ను కంట్రోల్ చేయ‌లేక‌పోతున్నారు. నేతలను డీల్ చేసే విషయంలో ఇదే జగన్ - చంద్రబాబు మధ్య ఉన్న తేడా.

ఈ ఇద్దరి మధ్య‌ తేడా ఇదేనా ?
X

అధినేతలన్నాక పార్టీపైన పూర్తి నియంత్రణుండాలి. నేతలను కనుసన్నలతో శాసించేంత కెపాసిటి ఉండాలి. అలా లేకపోతే ఎవరు మాటవినరు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈమధ్యనే ముగ్గురు సీనియర్ నేతలను సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో పార్టీ నుంచి బయటకు పంపేశారు. ఆమధ్య కొత్తపల్లి సుబ్బరాయుడు, ఈమధ్య రావి వెంకటరమణ ఇప్పుడు డీవై దాసును సస్పెండ్ చేశారు.

పార్టీ లైన్ దాటిన నేతల విషయంలో జగన్ కొంతవరకే ఉపేక్షిస్తున్నారు. ఇక లాభంలేదని అనుకోగానే ఎంతటి నేతలైనా కానీ వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. నేతలను సస్పెండ్ చేసే విషయంలో ఇప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్ప‌ప్పుడు కూడా ఇదే విధంగా కఠినంగా ఉండేవారు. అందుకనే జగన్ మాటంటే నేతలకు భయం. పరస్పర ఆరోపణలకు దిగిన కాకాణి గోవర్ధనరెడ్డి-అనీల్ కుమార్ యాదవ్, మార్గాని భరత్-జక్కంపూడి రాజా లాంటివాళ్ళని పిలిచి ఫుల్లుగా క్లాసుపీకిన ఫలితంగా వీళ్ళెవరు మళ్ళీ నోరెత్తలేదు.

ఇక చంద్రబాబునాయుడు అంటే పార్టీలో ఎవరికీ భయమేలేదు. క్రమశిక్షణ తప్పిన నేతలను ఉపేక్షించేదిలేదని ఊరికే ప్రకటనలు ఇవ్వటంతప్ప చంద్రబాబు ఇప్పటివరకు ఎవరిపైనా యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు. తమ్ముళ్ళ మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నా, పిలిచి పంచాయితీలు చేస్తున్నా ఎవరూ చంద్రబాబు మాటను లెక్కచేయటం లేదు. విజయవాడలో ఎంపీ కేశినేనాని-బోండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగూల్ మీరా వర్గాల మధ్య గొడవలే అతిపెద్ద ఉదాహరణ.

చంద్రబాబు ఎంతచెప్పినా వీళ్ళు వినకుండా మీడియా ముందు ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు చేసుకుంటునే ఉన్నారు. మొన్నటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కోవర్టులుగా పనిచేసిన నేతలపై యాక్షన్ తీసుకోబోతున్నట్లు ప్రకటించి తర్వాత పట్టించుకోలేదు. నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిలాల్లో నేతల మధ్య ప్రతిరోజు గొడవలే. పై జిల్లాల్లోని నేతల్లో ఏ ఒక్కరినీ చంద్రబాబు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటే ఏమి సమస్య వస్తుందో? ఎవరు ఎదురుతిరుగుతారో అన్న భయమే చంద్రబాబులో కనబడుతోంది. ఈ భయాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు కాబట్టే నేతలు రెచ్చిపోతున్నారు. నేతలను డీల్ చేసే విషయంలో ఇదే జగన్-చంద్రబాబు మధ్య ఉన్న తేడా.

First Published:  24 Oct 2022 8:05 AM GMT
Next Story