Telugu Global
Andhra Pradesh

మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నలేనా..?

విచారణ సందర్భంగా చేసిన ఇలాంటి వ్యాఖ్యల కారణంగానే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనకు సుప్రీం కోర్టు కూడా అనుకూలమే అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.

మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నలేనా..?
X

రాజధాని అమరావతిపై జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని అంశాలపై కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలను చూసిన తర్వాత ప్రభుత్వంతో పాటు మామూలు జనాల్లో కూడా మూడు రాజధానులకు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టే అనుకుంటున్నారు. ఇంతకీ ఆ వ్యాఖ్యలు ఏమిటంటే.. మొదటిది రాజధాని లేదా అభివృద్ధి అన్నది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత, అధికారమే అని చెప్పేసింది. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకరించటం తప్పని తేల్చేసింది.

ఆరు మాసాల్లో రాజధానిని నిర్మించాలన్న హైకోర్టు తీర్పును తప్పుపట్టింది. అసలు రాజధాని నిర్మాణంలోనూ, అభివృద్ధిలోనూ హైకోర్టు జోక్యం ఏమిటని ఆశ్చర్యపోయింది. ప్రభుత్వం చేయాల్సిన పనిని కూడా హైకోర్టే చేసేట్లయితే ఇక ప్రభుత్వం, కేబినెట్ ఉన్నది ఎందుకంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా చేసిన ఇలాంటి వ్యాఖ్యల కారణంగానే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనకు సుప్రీం కోర్టు కూడా అనుకూలమే అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.

అయితే విచారణలో భాగంగా సుప్రీం కోర్టు తన అభిప్రాయాలను వ్యక్తం చేసిందే కానీ, ఇదే ఫైనల్ జడ్జిమెంట్ కాదు. విచారణ సందర్భంగా జడ్జీలు అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు. అవన్నీ తమకు అనుకూలంగా ఉందని ఇరు వర్గాలు ఎవరికి వారు సంబరపడచ్చు. అయితే ఆ వ్యాఖ్యలన్నీ ఫైనల్ జడ్జిమెంటలో ప్రతిఫలించకపోవచ్చు. అలాగే చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా తీర్పు రానూవచ్చు. కాబట్టి సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యలను బట్టి ఇటు ప్రభుత్వం లేదా ప్రత్యర్థులు సంబరాలు చేసుకోవాల్సిన అవసరంలేదు అలాగే కుంగిపోవాల్సిన అవసరమూలేదు.

అయితే కేసును విచారించిన ఇద్దరు జడ్జీల్లో ఒకరైన కేఎం జోసెఫ్ ఒక మాటన్నారు. తన రాష్ట్రం కేరళలో సచివాలయం తిరువనంతపురంలోనూ, హైకోర్టు ఎర్నాకుళంలోనూ ఉన్నా తమకెప్పుడూ సమస్య రాలేదని, అలాంటిది ఏపీలోనే ఎందుకు సమస్య వస్తోందని ఆశ్చర్యపోయారు. దీన్నిబట్టి సెక్రటేరియట్, హైకోర్టు ఒకేచోట ఉండాల్సిన అవసరంలేదనేది జ‌స్టిస్ జోసెఫ్ అభిప్రాయంగా అర్థ‌మవుతోంది. ఇలాంటి వ్యాఖ్యలవల్లే మూడు రాజధానులకు అనుకూలంగానే అంతిమ తీర్పుంటుందని మంత్రులు భావిస్తున్నారు.

First Published:  30 Nov 2022 8:15 AM GMT
Next Story