Telugu Global
Andhra Pradesh

పరిటాలకు చంద్రబాబు షాకిచ్చారా..?

టికెట్ హామీ ఇస్తేనే బాధ్యతలు తీసుకుంటానని శ్రీరామ్ అడిగినప్పుడు చంద్రబాబు ఆ హామీ కూడా ఇచ్చారు. చంద్రబాబు హామీ ప్రకారం శ్రీరామ్ నియోజకవర్గంలో ఐదేళ్ళు కష్టపడ్డారు.

పరిటాలకు చంద్రబాబు షాకిచ్చారా..?
X

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు రాజకీయమంతా ఇలాగే ఉంటుంది. ఐదేళ్ళు నియోజకవర్గంలో కష్టపడిన వారికి చివరి నిమిషంలో మొండిచెయ్యి చూపటమే చంద్రబాబు స్టైల్. ఇప్పుడిదంతా ఎవరిగురించంటే.. ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ గురించే. 2019లో టీడీపీ ఘోరంగా ఓడిపోగానే అప్పటివరకు ఎమ్మెల్యేగా ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన గోనుగుంట్ల సూర్యనారాయణరెడ్డి @ వరదాపురం సూరి వెంటనే బీజేపీలోకి వెళిపోయారు. దాంతో నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడు కనబడలేదు. అందుకనే చంద్రబాబు ఏరికోరి పరిటాల శ్రీరామ్ కు బాధ్యతలు అప్పగించారు.

టికెట్ హామీ ఇస్తేనే బాధ్యతలు తీసుకుంటానని శ్రీరామ్ అడిగినప్పుడు చంద్రబాబు ఆ హామీ కూడా ఇచ్చారు. చంద్రబాబు హామీ ప్రకారం శ్రీరామ్ నియోజకవర్గంలో ఐదేళ్ళు కష్టపడ్డారు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చేటప్పటికి బీజేపీతో పొత్తు పేరుతో ధర్మవరం సీటును చంద్రబాబు వదిలేసుకున్నారు. దాంతో శ్రీరామ్ కు పెద్ద షాక్ తగిలినట్లయ్యింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో వరదాపురం సూరి ఒకరు. బీజేపీతో పొత్తుంటే ధర్మవరంను సూరి కోసమే కమలం పార్టీకి వదులేయాలన్నది చంద్రబాబు ప్లాన్.

ఒకవేళ పొత్తులేకపోతే సూరి బీజేపీకి రాజీనామా చేసి తిరిగి టీడీపీలో చేరిపోతారు. అప్పుడైనా టికెట్ దక్కేది సూరికే. ఇది చంద్రబాబు-సూరి మధ్య ఒప్పందం. ఏ రకంగా చూసుకున్నా శ్రీరామ్ కు టికెటిచ్చే ఉద్దేశ్యంలో చంద్రబాబు లేర‌న్నది వాస్తవం. శ్రీరామ్ కు టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు ముందే నిర్ణయించుకున్నా, అవసరం కోసం నోటికొచ్చిన హామీ ఇచ్చేశారు. ఆ హామీని నమ్మిన శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గంలో ఐదేళ్ళు బాగా కష్టపడ్డారు. తల్లి పరిటాల సునీత రాప్తాడులోను తాను ధర్మవరంలోను పోటీచేయబోతున్నట్లు చాలా సందర్భాల్లో శ్రీరామ్ ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ కు స్పష్టంగా చెప్పారు.

చివరికి బీజేపీతో పొత్తు కుదిరేటప్పటికి ధర్మవరం సీటును ముందునుండి అనుకుంటున్నట్లే చంద్రబాబు బీజేపీకి వదిలేశారు. చంద్రబాబును నమ్మినందుకు బకరా అయ్యింది శ్రీరామే. ఇప్పుడు టికెట్ సూరికే అన్న విషయం అర్థ‌మైపోయింది. దాంతో శ్రీరామ్ నానా గోలచేస్తున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన-టీడీపీ మధ్య ఎలాంటి వివాదం జరుగుతోందో.. అలాంటి వివాదమే ధర్మవరంలో పరిటాల-సూరి మధ్య పెరిగిపోతోంది. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

First Published:  14 March 2024 6:25 AM GMT
Next Story