Telugu Global
Andhra Pradesh

బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదా..?

బీసీలకు టీడీపీ ఎంతోచేసింది అన్న మాట వాస్తవమే. అయితే టీడీపీలో బీసీలకు జరిగిందంతా ఎన్టీఆర్ హయాంలో జరిగిందే కానీ చంద్రబాబు హయాంలో కాదు. ఈ విషయాన్ని చంద్రబాబు మాటల్లోనే అర్ధమవుతోంది.

బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదా..?
X

తన హయాంలో బీసీలకు ఏమీ చేయలేదన్న విషయాన్ని చంద్రబాబు నాయుడే స్వయంగా అంగీకరించారా..? ఇప్పుడిదే అంశంపై పెద్దఎత్తున చర్చ మొదలైంది. విజయనగరం జిల్లాలోని రాజాంలో బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతు జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందంటు మండిపడ్డారు. జగన్ అనుసరిస్తున్న తప్పుడు విధానాలే అధికారంలో నుండి తరిమేస్తాయన్నారు. బీసీల ఆర్ధిక స్ధితిగతుల మార్పుకు టీడీపీ ఎంతో చేసిందన్నారు.

బీసీలకు టీడీపీ ఎంతోచేసింది అన్న మాట వాస్తవమే. అయితే టీడీపీలో బీసీలకు జరిగిందంతా ఎన్టీఆర్ హయాంలో జరిగిందే కానీ చంద్రబాబు హయాంలో కాదు. ఈ విషయాన్ని చంద్రబాబు మాటల్లోనే అర్ధమవుతోంది. టీడీపీ ఆవిర్భావంతోనే బీసీల రాజకీయ, ఆర్ధిక పరిస్ధితుల్లో మార్పులొచ్చాయన్నారు. టీడీపీ ఆవిర్భావం అంటే పార్టీని పెట్టింది ఎన్టీయారే కదా. అయ్యన్నపాత్రుడు, యనమలరామకృష్ణుడు, దేవేందర్ గౌడ్, కేఈ కృష్ణమూర్తికి మంత్రిపదవులు ఇచ్చింది కూడా టీడీపీయే అన్నారు.

దేవేందర్ కి తప్ప మిగిలిన ముగ్గురికి మంత్రిపదవులిచ్చింది ఎన్టీఆరే కానీ చంద్రబాబు కాదు. చంద్రబాబు హయాంలో దేవేందర్ ఒక్కడికే కొత్తగా మంత్రిపదవి దక్కితే మిగిలిన ముగ్గురిని కంటిన్యు చేశారంతే. యర్రన్నాయుడిని కేంద్రమంత్రిని చేసింది టీడీపీయే అన్నది కరెక్టే. బీసీ కమిషన్ ఆవిర్భవించింది, కల్లుగీత కార్మికులను ఆదుకున్నది ఎన్టీఆరేనట. బీసీలకు రాజ్యసభ ఎంపీలుగా అవకాశం ఇచ్చింది కూడా ఎన్టీఆరే.

ఇలా ఏ విధంగా చూసినా టీడీపీలో బీసీలు లబ్దిపొందింది ఎన్టీఆర్ వల్లే కానీ తన వల్ల కాదని స్వయంగా చంద్రబాబే అంగీకరించినట్లయ్యింది. బీసీలకు టీడీపీ ఇంతచేసింది, ఎన్టీఆర్ అంత చేశారు అని చెప్పారే కానీ తన హయాంలో ఏమి చేసింది చెప్పలేదు. మరి చంద్రబాబు బీసీలకు ఏమిచేశారు ? ఏమిచేశారంటే దశాబ్దాలుగా పార్టీనే అంటిపెట్టుకునున్న బీసీలను తరిమేశారు. వివిధ అవసరాల కోసం తనను కలిసిన బీసీ సంఘాల నేతలతో మాట్లాడుతు తోకలు కత్తిరిస్తానని, జైల్లో పెట్టిస్తానని, సెక్రటేరియట్ లోకి ఎవరు రానిచ్చారని అందరిముందు వారిపై నోరుపారేసుకుని అవమానించారు. దాంతోనే అందరు కలిసి చంద్రబాబుకు అధికారాన్ని కట్ చేశారు. దూరమైపోయిన బీసీలు మరి చంద్రబాబుకు మద్దతిస్తారా ?

First Published:  24 Dec 2022 4:17 AM GMT
Next Story